- వాసవి అక్రమాలే సాక్ష్యం!
- లోకాయుక్తలో ఫిర్యాదుతో బట్టబయలైన బాగోతం
బల్దియా అంటే అవినీతికి కేరాఫ్ అడ్రస్… పాలకులకు, అధికారులకు కాసులు కురిపించే కామధేనువు. ఈ మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)లో అవినీతి ఏ స్థాయిలో పాతుకుపోయిందో చెప్పడానికి వాసవి గ్రూప్ అక్రమాల ఉదంతం ఒక మచ్చు తునక మాత్రమే. ప్రభుత్వ భూములను బడా బిల్డర్లకు అప్పనంగా కట్టబెడుతూ, నిబంధనలను పాతరేసి , కొందరు ఉన్నతాధికారులు తమ జేబులు ఎలా నింపుకుంటున్నారో ఈ ఘటన కళ్లకు కడుతోంది. ఈ అక్రమాలపై తాజాగా తెలంగాణ లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు కావడంతో, జీహెచ్ఎంసిలోని అవినీతి తిమింగలాల బాగోతం మరోసారి బట్టబయలైంది.
లోకాయుక్త ముందుకు చేరిన భూ కబ్జా బాగోతం:
గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 15, 16లలో ఉన్న రెండు ఎకరాల పన్నెండు గుంటల ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాలో ఉంది. అంటే, ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కానీ, చట్టాలు సామాన్యులకే కానీ తమకు వర్తించవన్నట్లుగా వాసవి గ్రూప్ అధినేత ఎర్రం విజయ్ కుమార్, శాంతా శ్రీరామ్, మద్ది నర్సయ్యలు ఈ భూమిలో అక్రమంగా భారీ నిర్మాణాలను చేపట్టారు. దీనికి జీహెచ్ఎంసి అధికారులే అండగా నిలిచారు. గతంలో జీహెచ్ఎంసి కమిషనర్‌గా పనిచేసిన రోనాల్డ్ రోస్, ప్రస్తుతం అదనపు చీఫ్ సిటీ ప్లానర్‌గా ఉన్న బి. ప్రమోద్ కుమార్ వంటి ఉన్నతాధికారులు కనీసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయకుండా, గుడ్డిగా ఈ అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఆక్యుపెన్సి సర్టిఫికెట్) జారీ చేశారంటే వారి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న సర్వే నెంబర్ 17లోని దాదాపు ₹300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేయడానికి ఈ అక్రమ అనుమతులనే అడ్డుపెట్టుకున్నారు. అంతేకాక, “బాక్స్ డ్రైన్” నిర్మాణం పేరుతో సహజ సిద్ధమైన నాలాను సైతం కబ్జా చేసి, పర్యావరణాన్ని, ప్రజా ఆస్తిని కాలరాశారు. ఈ మొత్తం వ్యవహారంపై వాసవి గ్రూప్‌తో పాటు, వారికి వంతపాడిన అధికారులపైనా లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలైంది.

అడుగడుగునా అవినీతి.. పట్టించుకునేవారేరి?
జీహెచ్ఎంసిలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. “ఇందు లేదు అందుగలదని సందేహం వలదు” అన్నట్లుగా ప్రతి విభాగంలో, ప్రతి పనిలో అవినీతి రాజ్యమేలుతోంది.
- పన్నుల మాయాజాలం: కమర్షియల్ భవనాలను రెసిడెన్షియల్ భవనాలుగా, భారీ నిర్మాణాలను చిన్నవిగా చూపిస్తూ కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ, తమ జేబులు నింపుకుంటున్నారు.
- నాసిరకం పనుల దందా: రోడ్లు, నాలాల నిర్మాణాల్లో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం పనులతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. వేసిన రోడ్డు నెల తిరగకముందే గుంతలమయం అయినా, కట్టిన నాలా చిన్న వర్షానికే కూలిపోతున్న అడిగేవారే లేరు. కమిషన్లు చేతులు మారితే చాలు, నాణ్యతను గాలికొదిలేస్తున్నారు.
- చిల్లర దొంగతనాలు: ఇక కిందిస్థాయిలో జరిగే అవినీతి గురించి చెప్పనక్కర్లేదు. పారిశుద్ధ్య కార్మికులకు చీపురు కట్టలు (జాడు కట్టలు) ఇవ్వకుండానే, వాటిని సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించి నిధులు నొక్కేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.
ప్రజా సేవకులా? రాజకీయ బానిసలా?
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, చట్టాలను కాపాడాల్సిన ఐఏఎస్ స్థాయి అధికారులే అవినీతికి తలుపులు తెరుస్తున్నారు. ఎన్నో ఫిర్యాదులు, పత్రికా కథనాలు వస్తున్నా జీహెచ్ఎంసి కమిషనర్ వంటి ఉన్నతాధికారులు ‘మాకేమీ పట్టనట్టు’ వ్యవహరించడం శోచనీయం. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి, చట్టవిరుద్ధమైన ఉత్తర్వులపై సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు లభించిన అధికారాన్ని ప్రజాసేవకు కాకుండా, రాజకీయ బాసులను, బడా బిల్డర్లను ప్రసన్నం చేసుకోవడానికి వాడుకోవడం సిగ్గుచేటు.
ఈ వాసవి గ్రూప్ ఉదంతం కేవలం ఒక ప్రారంభం మాత్రమే. లోకాయుక్త ఈ కేసును నిష్పక్షపాతంగా, లోతుగా విచారించి దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. కేవలం బిల్డర్లను మాత్రమే కాకుండా, వారికి అండగా నిలిచిన అవినీతి అధికారుల మెడలు వంచినప్పుడే జీహెచ్ఎంసి ప్రక్షాళన దిశగా తొలి అడుగు పడినట్లు. లేదంటే, జీహెచ్ఎంసీలో అవినీతి అధికారులు బరితెగించి, అవినీతికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి.. వీరి అవినీతి వల్ల ప్రభుత్వానికి మచ్చ ఏర్పడుతుంది.. ఇకనైనా ప్రభుత్వం, అవినీతి నిరోధక శాఖ అక్రమార్కుల బరతం పట్టాలని ప్రజానీకం కోరుకుంటుంది.