హనుమకొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉద్రిక్తత
హనుమకొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుడు ప్రతాప్ రెడ్డి మంత్రి కొండా సురేఖ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా సమస్య చెప్పుకుందామంటే కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కోర్టు తీర్పు ఉన్నా పట్టించుకోవడం లేదు” అని ఆయన వాపోయారు. పోరాటాలు తామే చేస్తే, పదవులు రాజకీయ నాయకులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమంలో ఉన్న పలువురు నేతలు, అధికారులు ఈ పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు.