ప్రకాశం జిల్లాలోని చిన్నారుట్ల చెంచుగూడే గ్రామంలో అర్ధరాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని ఓ చిరుతపులి నోటకరచుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, గ్రామస్థులు, తల్లిదండ్రుల ధైర్యసాహసాలతో ఆ పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం.. పెద్దదోర్నాల మండలానికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతులు తమ కుమార్తె అంజమ్మతో ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన చిరుత, పాప తలను నోట పట్టుకుని నెమ్మదిగా బయటకు ఈడ్చుకెళ్లింది. చిన్నారి రోదన విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా మేల్కొని కర్రలు పట్టుకుని చిరుతను వెంబడించారు. వారి అరుపులు విని గ్రామస్థులు కూడా పరుగున చేరుకుని గోల చేసారు. భయపడ్డ చిరుత, కొంతదూరంలో ఉన్న పొదల్లో పాపను వదిలి అడవిలోకి పారిపోయింది. ఈ దాడిలో పాప తల, పొట్ట భాగాల్లో తీవ్రమైన గాయాలు అయ్యాయి. తక్షణమే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన చిన్నారికి ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మహేశ్ ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు, గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్లే వన్యప్రాణులు నిర్భయంగా వస్తున్నాయన్న ఆరోపణలతో గురువారం ఉదయం దోర్నాల-శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న అటవీ మరియు పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని ప్రజలతో చర్చించారు. గూడేనికి త్వరలోనే విద్యుత్ సరఫరా ఏర్పాటు చేస్తామన్న హామీపై ఆందోళనకారులు ధర్నా విరమించారు.