సామాన్యులకు కేంద్రం శుభవార్త
పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సొంత వాహనం కొనాలనుకునే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట రానుంది. కార్లు, ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ (వస్తు–సేవల పన్ను) రేటును గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీపావళి నాటికి ప్రజలకు “డబుల్ బొనాంజా” అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత చేకూరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు అంచెల జీఎస్టీ విధానాన్ని రెండు శ్లాబులకు పరిమితం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
5% మరియు 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని సూచిస్తూ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌కు పంపింది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ కౌన్సిల్ సెప్టెంబర్‌లో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. మార్పులు అమలైతే ప్రస్తుతం 28% పన్ను విధింపబడుతున్న కార్లు, బైకులు 18% శ్లాబులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్యాసింజర్ కార్లపై 28% జీఎస్టీతో పాటు ఇంజిన్ సామర్థ్యం, పొడవు ఆధారంగా 1% నుంచి 22% వరకు పరిహార సెస్సు విధిస్తున్నారు. దీని వలన పన్ను భారం 50% వరకు చేరుతోంది. ద్విచక్ర వాహనాలపైనా 28% జీఎస్టీ ఉంది. కొత్త విధానంలో 12% మరియు 28% శ్లాబులను తొలగించనుండటంతో మాస్ మార్కెట్ కార్లు, బైకుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అయితే లగ్జరీ కార్లు వంటి కొన్ని విభాగాలపై 40% వరకు ప్రత్యేక పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.