మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అదే కేసులో మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంకు కూడా నోటీసులు పంపింది. గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల పాటు సాగిన విచారణ అనంతరం మొత్తం ఏడుగురిలో ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా తేల్చి ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి కూడా రూ.2 లక్షల జరిమానా విధించారు.
అయితే, అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు వారిని విముక్తి కల్పించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు విచారణలో భాగంగా ఇద్దరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి, కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.