తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా విద్యాశాఖపైన నిర్లక్ష్యం చూపడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నందున ఈ రంగానికి ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. చివరి సంవత్సరం ఎన్నికలతోనే గడిచిపోతుంది. కాబట్టి మిగిలింది రెండు సంవత్సరాల సమయం మాత్రమే. ఈ వ్యవధిలోనే విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి” అని మురళి వ్యాఖ్యానించారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ – “మధ్యాహ్న భోజన నాణ్యత సరైన స్థాయిలో లేదు. పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మేము ఇప్పటికే నివేదిక ఇచ్చాం. భోజనం వండే స్వయం సహాయక గ్రూపుల మహిళలు తమ సొంత డబ్బుతో పెట్టుబడి పెట్టి వండిపెడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బిల్లులు చెల్లించక వారు అప్పులపాలవుతున్నారు” అన్నారు. “ఐదు సంవత్సరాల క్రితం ఉన్న రేట్లతోనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆ రేట్లతో వారు ఎలా బతుకుతారు? వారికి వారానికోసారి చెల్లింపులు జరగాలి. కానీ మూడు నెలలకు, ఆరు నెలలకు చెల్లిస్తే వారు ఇబ్బందులు పడతారు. మేము మూడు నెలల క్రితం విద్యాశాఖకు ఈ సూచనలతో రిపోర్టు ఇచ్చినా పట్టించుకోవడం లేదు” అని మురళి ఆవేదన వ్యక్తం చేశారు.