సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి
తిరుమలలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మలయప్పస్వామి వారు ఉభయదేవేరులతో సర్వభూపాల వాహనంపై వేంచేశారు. మరో పల్లకిలో సర్వ సైన్యాధ్యక్షడు విష్వక్సేనులు దక్షిణ అభిముఖంగా వేంచేశారు. ఉత్సవ మూర్తులతో పాటు మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. జీయర్లు ఊరేగింపుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం పుష్పపల్లకి వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుంచి తితిదే వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. తితిదే ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.

ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్తోక్త్రర్రగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించారు.
సంవత్సరంలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలు కొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు-, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంచేశారు.