భూమిపూజ చేసిన సంస్థ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స, పరిశోధన కేంద్రాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజను సంస్థ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించారు.

రెండు దశల్లో నిర్మాణం
మొత్తం 21 ఎకరాల్లో నిర్మించబోయే ఈ క్యాన్సర్ కేర్ క్యాంపస్‌లో సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధన సదుపాయాలు, రోగుల సంరక్షణకు ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ఏర్పాటుకానుంది. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలను అందించనున్నారు. రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నారు. వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స మొదలైన అంశాలకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌తో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రంలో 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయి.

రెండో దశలో పడకల సంఖ్యను 1,000కు పెంచి, ప్రత్యేక విభాగాలు, అధునాతన పరిశోధనా విభాగాలు ఏర్పాటు చేస్తారు. క్లిష్టమైన మరియు అరుదైన క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రిఫరల్ సెంటర్‌గా ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దాలని సంస్థ యోచిస్తోంది.