- అందుకే రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది
- బిసిల కోసం అవసరమైతే ఎంపిలు రాజీనామా చేయాలి
- మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యం అనడం బీజేపీ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బిజెపి మాట్లాడుతున్న తీరు దాని బిసి వత్యిరేకతను బయటపెట్టిందన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో ఇదే విధమైన రిజర్వేషన్లు అమలు అయ్యాయి. సుప్రీంకోర్టు ఇందిరా సహనీ కేసులో స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ప్రమాణితమైన సమాచారం, ఎంపెరికల్ డేటా ఉంటే వారు రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసింది, కేబినెట్ ఆమోదం తీసుకుంది, శాసనసభ ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోదంతో అది ఇప్పుడు ఢిల్లీలో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రిజర్వేషన్ల కోసం రాజీనామా చేయాలి. నిజంగా బీసీల పక్షాన నిలబడాలని ఉంటే, రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చూపాలి. లేకపోతే బీసీల పట్ల కుట్ర చేస్తూ ఉంటారని భావించాలని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.
అనాడు మండల కమిషన్‌ను వ్యతిరేకించింది బీజేపీయే. ఇప్పుడు మళ్లీ బీసీల రిజర్వేషన్లపై వక్రబుద్ధిని చూపిస్తోంది. తెలంగాణలోని అన్ని బీసీ సంఘాలు ఈ కుట్రను గమనించి రిజర్వేషన్ హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలని పొన్నం పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీల పక్షాన నిలుస్తున్నారు. మా పీసీసీ అధ్యక్షుడు కూడా బీసీ వర్గానికే చెందినవారు. మా వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. అదే సమయంలో, బీజేపీపై విరుచుకుపడుతూ, మీరు ముఖ్యమంత్రి బీసీ అని, సిఎల్పీ నాయకుడు బీసీ అని మభ్యపెడతారు. కానీ పార్టీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి ఇవ్వని మీరు, మళ్లీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు. ఇది మీ అసలు స్వరూపం అని మంత్రి ఆరోపించారు.