- దలైలామాకు భారతరత్న ఇవ్వాలి
- పలువురు ఎంపిల సంతకాల సేకరణ
దలైలామా భారతరత్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పదిమంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది. దీనిపై రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్ మాట్లాడుతూ, దలైలామాకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ 80 మంది ఎంపీలు విజ్ఞానపత్రంపై సంతకాలు చేశారని, 100 మంది ఎంపీల సంతకాలు పూర్తికాగానే దానిని సమర్పిస్తామని చెప్పారు. సంతకాలు చేసిన వారిలో విపక్ష పార్టీల ఎంపీలు సైతం ఉన్నారని చెప్పారు. దలైలామాకు భారతరత్న ఇవ్వాలంటూ చేపట్టిన సంతకాల ప్రచారానికి పలువురు ఎంపీలు ముందుకు రాగా, కొందరు తమ ప్రచారానికి మద్దతు తెలుపుతూ వీడియో సందేశాలు పంపారని తెలిపారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి దలైలామా మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ లోక్‌సభ, రాజ్యసభ స్పీకర్లకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు. బౌద్ధమతాన్ని విసృతంగా ప్రచారం చేస్తున్న దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి.ప్రపంచ దేశాల నుంచి వేలాదిగా బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే భారత్-చైనా మధ్య ఇటీవల కాలంలో దలైలామా వారసుడి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదిన వేడుకలు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో అట్టహాసంగా జరగ్గా.. ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జన్మదిన వేడుకలకు భారత ప్రతినిధులు హాజరయ్యారు. వీటిపై చైనా అభ్యంతరం వ్యక్తంచేసింది. టిబెట్ సంబంధిత అంశాలపై బీజింగ్ అభిప్రాయాలను న్యూదిల్లీ పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. దలైలామాకు మోదీ శుభాకాంక్షలు చెప్పడంపై విూడియా అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ స్పందించారు. టిబెట్ సంబంధిత వ్యవహారాలపై చైనా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. ఇది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.