- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన కానుకను అందించారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించిన ఆయన, రాష్ట్రంలోని మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు 2024 ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చి తన ప్రభుత్వానికి మద్దతు తెలిపారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఏడాది పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఆల్ టైం రికార్డు స్థాయిలో సాధించామని ఆయన గర్వంగా పేర్కొన్నారు.
ప్రధాన ఎన్నికల హామీలైన ‘సూపర్ సిక్స్’ పథకాల అమలు విజయవంతంగా సాగుతోందని చెప్పారు. ‘తల్లికి వందనం’ పథకం కింద కోట్లాది తల్లులకు ఆర్థిక భరోసా అందించామని, ‘ఎన్టీఆర్ భరోసా’ ద్వారా 64 లక్షల మందికి ఇంటి వద్దకే పింఛన్లు చేరుతున్నాయని వివరించారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,173 కోట్లు జమ చేశామని, ‘దీపం’ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమకు నీటి సరఫరా కోసం గోదావరి వరద నీటిని బనకచర్లకు తరలిస్తామని, దీని వలన ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని, రూ.5.94 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని, దీని ద్వారా 5.56 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. యువత కోసం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామని చెప్పారు. భూయజమానుల భద్రత కోసం ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, అందులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.