ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర క్రీడలు, కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. తెలంగాణలో క్రీడా యూనివర్సిటీ, ఖేలో ఇండియాపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ వేదికగా అనేక క్రీడలు నిర్వహించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రికి వినతి చేశారు. రాష్ట్రంలో క్రీడలకు ఏ విధంగా ప్రాచుర్యం కల్పిస్తున్నామనే విషయాన్ని తెలిపారు. క్రీడలు సంబంధించి అనేక స్టేడియంలతో పాటు వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా పలు అంశాలపై కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి పలు వినతి పత్రాలను అందజేశారు.
జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణలో మౌలికంగా వసతులు ఉన్నాయని.. అలాగే 2002 – 2003లో జరిగి ఏషియన్ గేమ్స్‌కు సంబంధించి ఆనాడు ఏ విధంగా హైదరాబాద్ వేదికగా మారిందనే విషయాన్ని కేంద్రమంత్రికి తెలియజేశారు. క్రీడా పరంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు సీఎం వివరించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మరికొంత మంది కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.