- రూపుదిద్దుకుంటున్న ద్విభాషా విధానం
- పాలసీ విడుదల చేసిన ఎం.కే. స్టాలిన్
హిందీ భాషా విధానం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ శుక్రవారం రాష్ట్రానికి ప్రత్యేకంగా రూపొందించిన స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ఆవిష్కరించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంకి ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈ పాలసీని విడుదల చేశారు. త్రిభాషా విధానాన్ని తిరస్కరించి, ద్విభాషా విధానాన్ని అనుసరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ముసాయిదా సిద్ధం కోసం 2022లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సిఫారసుల ఆధారంగా ఎన్ఈపీకి తుది రూపం ఇచ్చారు.
కొత్త విద్యా విధానంలో మాతృభాష, ఆంగ్ల భాషలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కృత్రిమ మేధ, సైన్స్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రాష్ట్రం వ్యతిరేకిస్తున్న నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల బదులుగా, 11వ మరియు 12వ తరగతుల మార్కుల ఆధారంగా ఉన్నత విద్య ప్రవేశాలు కల్పించనున్నారు. ఎన్ఈపీలో త్రిభాషా విధానం తప్పనిసరి చేయడంపై తమిళనాడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తోంది. ఎన్ఈపీ అమలు చేయకపోవడంతో, సమగ్ర శిక్ష పథకం కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.2,152 కోట్ల నిధులు నిలిపివేసినట్లు కూడా ఆరోపించింది.