- హంద్రీనీవా ప్రాజెక్టుతో రైతులందరికి మేలు
- రాయలసీమకు నీరివ్వడమే మా లక్ష్యం
- సీమ కరువు కాటకాలు తెలిసిన వ్యక్తిని
- ఎన్టీఆర్ ఆలోచనలో పుట్టిందే హంద్రీనీవా
- గత ఐదేళ్లు జగన్ ఏమీ చేయలేదని విమర్శలు
- మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటి విడుదల చేసిన సిఎం చంద్రబాబు
రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. రాయలసీమ కరవు, కష్టాలు, ప్రజల బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ మాది. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ తొలిసారి ఆలోచించారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన ఆశయాలను తెదేపా నెరవేర్చింది. రాయలసీమకు నీరిచ్చాకే చెన్నైకి నీళ్లు ఇస్తానని ఆనాడు ఎన్టీఆర్ చెప్పారు.
హంద్రీనీవా నీరు 550 కి.మీ ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పీఏబీఆర్, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, మదనపల్లె, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తుంది. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకొని పనిచేసే మనస్తత్వం నాది. వేరే రాష్ట్రానికి వెళ్తున్న కియాను అనంతపురం తీసుకొచ్చా. 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీళ్లిచ్చిన ఘనత మాది. రాయలసీమ రైతు కుటుంబాల్లో మార్పు రావాలనేదే నా లక్ష్యం. తొలి దశలో 1.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు వస్తుందని బాబు అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాష్ట్రానికి పేరు రావాలని, ప్రజల జీవితాలు బాగుపడాలని నిత్యం కోరుకుంటా. రాయలసీమకు రూ.2 వేల కోట్లు- కూడా వైకాపా ఖర్చు చేయలేదు. హంద్రీనీవాకు కనీసం రూపాయి ఖర్చుపెట్టారా? అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది మా ప్రభుత్వమే. మా హయాంలోనే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గండికోట వచ్చాయి. నదుల అనుసంధానం జరగాలనేది నా జీవిత ఆశయం. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరవు అనే మాటే ఉండదు. ఇప్పుడు రాయలసీమలోని అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి.
రాయలసీమను రతనాలసీమగా మారుస్తామనే ధైర్యం వచ్చింది. శ్రీశైలం నుంచి ఎస్‌ఆర్‌బీసీ, ముచ్చుమర్రి, మల్యాల కాల్వలు వస్తాయి. హంద్రీనీవా నుంచి అనంతపురం, పత్తికొండ, గొల్లపల్లికి మరో కాల్వ వెళ్తుంది. గాలేరు- నగరి నుంచి గండికోట, అవుకు, మైలవరానికి నీళ్లు వస్తాయి. శ్రీశైలం నుంచి ప్రారంభమైన నీరు తిరుపతికి వెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు. రాజకీయాలు సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. క్లైమోమోర్ మైన్స్ కూడా నన్ను ఏవిూ చేయలేకపోయాయి. రాయలసీమ లో అన్ని రకాల వనరులు ఉన్నాయి. మంచి రోడ్లు ఉన్నాయి. ఎక్కడికైనా సులువుగా వెళ్లవచ్చు. వైకాపా హయాంలో ఐదేళ్లపాటు- ఒక్క గుంత కూడా పూడ్చలేదు. రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ రోడ్లను అందంగా మారుస్తాం. చెప్పిన ప్రతిమాట నిలబెట్టుకుంటున్నానా? లేదా? గత ప్రభుత్వం పింఛను రూ. వెయ్యికి పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంది. మేం వచ్చాక ఒకేసారి రూ. వెయ్యి పెంచి పింఛను ఇచ్చాం. దివ్యాంగుల పింఛను ఒకేసారి రూ.6 వేలకు పెంచిన ఘనత మాదే. పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేశారు. మేం వచ్చాక మళ్లీ 207 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. 21 దేవాలయాల్లో అన్నప్రసాదం ప్రారంభించాం అని చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ఫేజ్-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్‌లో రెండు మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది.
ఈ సందర్భంగా జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. ప్రాజెక్టు అలైన్ మెంట్, ఆయకట్టు-, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్‌లను పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వ్యూపాయింట్ నుంచి నీటి విడుదలను వీక్షించారు. నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ బైరెడ్డి శబరి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయలసీమలో అరాచకం సృష్టించాలని మాజీ సీఎం జగన్ చూస్తున్నారని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. మన జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. బనకచర్లపై జగన్ మాటలను చరిత్ర క్షమించదన్నారు. కేవలం 100 రోజుల్లోనే హంద్రీనీవా కాల్వ సామర్థ్యాన్ని 12 పంపులకు పెంచాం. వైకాపా హయాంలో గంప మట్టి కూడా తీయలేని పరిస్థితి నెలకొంది. జగన్ మళ్లీ పాలెగాళ్ల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. రాయలసీమను అభివృద్ధి చేసింది మా పార్టీయే. విూ వైపు ఎంతమంది మారినా.. మా వైపు ఒకే నాయకుడు ఉన్నారు. వైకాపా నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని పయ్యావుల కేశవ్ విమర్శించారు.