- కల్లు కాంపౌడ్‌లను ఎత్తేసే కుట్ర
- కులవృత్తులను అగౌరవపరుస్తున్న కాంగ్రెస్
- మండిపడ్డ మాజీమంత్రి శ్రీనివాసగౌడ్
కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశనం చేయాలని చూస్తుందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ కుల వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆదాయం వచ్చే కుల వృత్తులను ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందన్నారు. గీత కార్మికులకు ఐదు ఎకరాల పొలం ఇస్తామని చెప్పారు. గీత కార్మికులు చెట్లపై నుంచి పడి చనిపోతే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లుగీత వృత్తిని బంద్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కల్లు కంపౌండ్ ద్వారా పది కులాలు బ్రతుకుతున్నాయి. ఉప్పల్‌లో తాటి చెట్లు కొట్టి గీత కార్మికులకు నష్టం చేశారు. కల్లు కంపౌండ్‌ను నిషేధిస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తోంది. లిక్కర్ కంపెనీలు, డిస్టలరీలన్ని ఒకరిద్దరి చేతుల్లో నడుస్తున్నాయి. లిక్కర్ కంపెనీల కవిూషన్లకు కక్కుర్తిపడి, లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లు కాంపౌండ్ బంద్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కల్లులో మీరే ఏదో కలిపి కుట్ర చేస్తూ ఓఆర్‌ఆర్ లోపల కల్లుపై నిషేధం విధించాలని చూస్తున్నారు. కుల వృత్తిని అవమానించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని నిషేధించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అవుతుంది. కల్తీ పాలు అరిటకట్టడంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫార్మా కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఇతర రాష్టాల్ల్రో నిషేధించిన బీర్లను తెలంగాణలో అమ్ముతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఒక్కో ఎమ్మెల్యేకు 10 నుంచి 15 లక్షలు ఇస్తున్నారు. దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు నెలవారీ డబ్బులు తీసుకుంటున్నారు. కల్తీ కల్లును ప్రోత్సహిస్తున్నది ఎవరనేది ప్రభుత్వం తేల్చాలి. గీత సంఘాల నుంచి ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటూ కల్తీ కల్లును ప్రోత్సహిస్తున్నారా? బిఆర్‌ఎస్ హయాంలో జిల్లాకో నీరా కేంద్రం పెట్టాలని భావించాం. హైదరాబాద్ నగర నడిబొడ్డున నీరా కేఫ్ పెట్టి కులవృత్తిని కాపాడాం. కల్లు కంపౌండ్ దమ్ముంటే బంద్ చేసి చూడండి. కల్లు కంపౌండ్ బంద్ చేస్తే ప్రభుత్వాన్ని నడవనీయం. మళ్లీ కేసీఆర్ సీఎం కాగానే కల్లు దుకాణాలను తెరిపిస్తాం. వైన్ షాపులు కల్లుగీత కార్మికుల కుటుంబాలకు ఇస్తాం అని ప్రకటించారు.

నిజామాబాద్ జిల్లాలో గౌడ కులస్తులపై నిషేధం విధించారు. 60 మంది గౌడ కుల స్త్రీలు గుడికి వెళ్తే గుళ్లోకి రావద్దని వెనక్కి పంపారు. లక్షలు, లక్షలు మామూళ్లు తీసుకుని కల్లు దుకాణాలు బంద్ చేస్తామంటే చూస్తూ ఊరుకోం. కల్లు దుకాణాలు బంద్ పెడితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద మామూళ్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేల పేర్లు బయటపెడతాం. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో గీత చెట్లు ఉన్నాయి. కల్లు కంపౌండ్ పేదోళ్లకు రిక్రియేషన్ సెంటర్ లాగా ఉంటుంది. తాము అధికారంలోకి వచ్చాక లిక్కర్ మాఫియా నుంచి, కల్లు కంపౌండ్ నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. అలాగే తాటి చెట్లు నరికిన వారిపై కేసులు పెట్టాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. 34 శాతం రిజర్వేషన్లపై 2013లో కాంగ్రెస్ పార్టీ కోర్టుకు అఫిడవిట్ ఇచ్చి, ఈసారికి మాత్రమే బీసీ రిజర్వేషన్లు అని చెప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మూలంగానే ఏపీ, తెలంగాణలో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నట్లు తెలిపారు. బీసీలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల రేవంత్ రెడ్డి. ఎప్పుడూ సానుకూలంగా లేరన్నారు. 2018లో మహారాష్ట్రలో ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తే నామినేషన్లు తర్వాత కోర్టు తీర్పు ద్వారా ఎన్నికలు ఆగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లడంతోనే బీసీలకు గతంలో రిజర్వేషన్లు రాలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వద్దకు తీసుకువెళ్లి కేంద్రంపై పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి ఎన్నికలు నిర్వహించాలని భిక్షమయ్య గౌడ్ చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గం పర్యటన సందర్భంగా గౌడన్నలకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసిన శ్రీకాంత్ అనే యువకుడిని కొట్టించారన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు. శ్రీకాంత్‌పై జరిగిన దాడికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.
కల్లు అనేది ప్రకృతి పానీయమని, అలాంటి కల్లుని నిషేధించాలని ప్రభుత్వం చూస్తోందని కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. కల్తీ కల్లును కచ్చితంగా అరికట్టాలి. కానీ ఆ పేరుతో కల్లును నిషేదిస్తే ఖబడ్దార్ రేవంత్ రెడ్డి అని ఆయన హెచ్చరించారు. కల్లు మండువాలు, కల్లు గీత కార్మికుల జోలికి వస్తే రాజకీయంగా సంగతి తెలుస్తామన్నారు. కల్లుగీత కార్మికులకు 25 శాతం వైన్ షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని దుయ్యబట్టారు. కల్లుగీత కార్మికులను దొంగల్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, గీత కార్మికుల ఉసురు ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందన్నారు. నీరా కేఫ్‌ను హైదరాబాద్ నగరంలో పెడితే కాంగ్రెస్ వచ్చాక ఆగం చేసిందన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు గట్టు రాంచందర్ రావు, నాగేందర్ గౌడ్ పాల్గొన్నారు.