Tuesday, July 22, 2025
spot_img

దశ పాప హర దశమి

Must Read

జ్యేష్ఠ బహుళ దశమి గంగావతరణ దినం

దశమి తిథితో సంబంధం కలిగిన రెండు పెద్ద పండుగలు పడి మనకు ముఖ్యమైనవి. ఒకటి జేష్ట శుద్ధ దశమి కాగా, మరొకటి “విజయ దశమి”. రెండూ పది రోజుల పర్యాప్తం అయ్యే పాడ్యమి తిధులతో ప్రారంభమై దశమితో ముగిసే పర్వాలు. జేష్ఠ మాస ఆరంభంలో శుక్ల పక్ష ప్రతిపద నుండి దశమి వరకు “గంగోత్సవాల” పేరుతో, నవరాత్రులు ఆచరించడం, “దశపాప హర దశమి”గా దశమిని అనంతరం “నిర్జల ఏకాదశి” అనుసరించడం సనాతన సంప్రదాయం. జ్యేష్ట శుక్ల దశమి నాడు “గంగావతరణం” జరిగిందని స్మృతి కౌస్తుభం చెబుతున్నది. సోమవారంతో హస్తా నక్షత్రంతో కలసి వచ్చినప్పుడు, “గంగావతరణం” జరిగిందని వాల్మీకి రామాయణం స్పష్టం చేస్తున్నట్లు వ్రతోత్సవ చంద్రిక కారుడు పేర్కొన్నాడు.

గంగ దేవలోకంలో “మందాకిని అని, భూలోకంలో నికి “భాగీరథి” అని, పాతాళంలో “భోగవతి”గాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునికి వివరించాడు. అందుకే గంగకు “త్రిపధగ” అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడు లోకాల్లో ప్రవహించేదని అర్ధం. భగీరథుడు తన పితృ దేవతల పుణ్య లోకాల ప్రాప్తికై, మొదట బ్రహ్మ ను, తర్వాత శివుని తపస్సుతో మెప్పించిన ఫలితంగా, గంగ బ్రహ్మ ఆదేశానుసారం శివుని జటాజూటం లోనికి వచ్చిపడి, బంధితురాలై, తిరిగి భగీరథుడి అభ్యర్థనపై పరమ శివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించ బడిన బిందు సరోవరంలో పడేలావిడిచి పెట్టాడు. నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే “ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేశించాడు. బిందు సరోవరం నుండి గంగ ఏడు పాయలుగా చీలి ప్రవహించింది. ఒక పాయ భగీరథుని రథము వెంట పరుగులు తీస్తూ సాగింది.

గంగ 7 పాయలుగా విడిపోగా, అందులో మూడుపాయలు తూర్పు దిక్కుకు వెళ్ళి పోయాయి. వాటికి లాధిని, నళిని, పాధిని అని పేర్లు. మూడు పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాయి. అవి సుచక్షువు, సీత, సింధువు అని పిలువ బడుతున్నాయి. మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి.

నదులను పూజించే ఆర్యుల ఆచారం నేపథ్యంలోనే “గంగోత్సవం” అనే పేరున నవరాత్రి ఉత్సవాలు “దశహర వ్రతం” పేరున నిర్వహించే ఆచారం అనాదిగా అమలులో ఉంది. గంగా నది నీరు అత్యంత పవిత్రమైంది. ఎన్నాళ్ళు నిలువ వున్నా చెడిపోనిది. అందుకే నిర్మల నదీ జలాలను పూజించి,  నదీస్నానం ఆచరించి, షోడశోపచార విధివిధాన అర్చనలు, నిత్య కర్మాను ష్టానాలను, దానధర్మాలను, నది వద్ద నిర్వహించడం, సనాతన వారసత్వం ఆచరణగా మారింది. గంగా తీరం క్షేత్రాలైన కాశీ, హరిద్వార్, నాసిక్, మధుర, ప్రయాగ, నదీ తీరాలలో ఉత్సవం బాగా ఆచరిస్తారు. అక్కడక్కడ గంగాదేవి ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. గంగోత్సవానికి మరో పేరు… “దశపాపహర దశమి” లేదా “దశహర దశమి”. పది పాపాలను హరించేది అని అర్థం.

“లింగం దశాశ్వమేధేశం, దృష్ట్యా దశహరా తిథి, దశ జన్మార్జితై: పాపై:, త్యజ్యతే నాత్ర సంశయః”…. దశహర తిథి నాడు దశాశ్వమేధ ఘట్టం లోని లింగమును చూసినట్టయితే లోగడ పది జన్మలలో చేసిన పాపం నిస్సందేహంగా నశించి పోతుంది” అని తాత్పర్యం. ఈనాటి సంకల్పంలో “మమ ఏతజ్జన్మ జన్మాంతర సముధ్భూత దశవిధ పాప క్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్ధం దశహర పర్వ నిమిత్తం స్నాన మహం కరిష్యే” అని ఆచరిస్తారు. జన్మ  జన్మాంతరాల నుండి వచ్చిన పది విధాల పాపాలు  పోగొట్టే స్నానమని భావము. జేష్ఠ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు అనుదినం స్త్రీలు పిండి వంటలు చేసి, ప్రతిరోజు పదేసి భక్షాలు, దక్షిణ యుతంగా గురువులకు సమర్పించి, పదకొండవ రోజు  “నిర్జలైకాదశి” నాడు పచ్చి మంచి నీళ్ళు అయినా ముట్టకుండా ఉపవాసం ఉండటం, అనాదిగా ఆచరణలో ఉన్న సంప్రదాయం.

మొగలాయి  చక్రవర్తుల కాలాన “జగన్నాథ పండిత రాయలు” అనే  ఆంధ్ర ప్రాంత సంస్కృత బ్రాహ్మణ కవి, ఒక ” మహమ్మదీయ స్త్రీని వివాహమాడిన క్రమంలో, సనాతనులు సంఘ బహిషృతులు కాగా, తన మరియు తన భార్య పాతివ్రత్యంను నిరూపించేందుకు కాశీ వెళ్లి పండితులతో వాదించినా ఫలితం లేక, 52 మెట్లున్న ఒక రేవులో రెండో మెట్టు పై కూర్చొని 52 స్తోత్రం శ్లోకాలు చెప్పగా ఒక్కో శ్లోక పఠనానికి, గంగా నది ఒక్కో మెట్టు పైకి వచ్చి చివరి శ్లోకంతో పండిత రాయలను ముంచేసిందని, తద్వారా పవిత్రతను చాటి చెప్పారని  కథనాలున్నాయి. నదులను పూజించే ఆచారం ఆర్యులను బట్టి ఏర్పడినా, ఈ రూపేణా ఒక ఆంధ్ర  సంస్కృత కవి, ఉత్తర హిందూ దేశంలో పూజితుడు కావడం ప్రత్యేకం. దక్షిణాదిన దశ పాప హర దశమి పర్వం సదాశివ

బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి యతి వారి పూజకు ప్రత్యేకించ బడడం విశేషం. వైశాఖ మాసం అంతా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వెరూరు గ్రామం చేరి “నేను జేష్ఠ శుద్ధ దశమి నాడు జీవితం సాధిస్తాను. ఆ రోజున కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు ఒక లింగాన్ని తెస్తాడు. నా సమాధి సమీపంలో ఒక ఆలయం కట్టించి, లింగ ప్రతిష్ట చేయండి” అని చెప్పినట్లు కథనం. దశమి నాడు ఆయన ఆదేశానుసారం తవ్వబడిన గోతిలో, స్వామి ఉపవిష్టుడు కాగా, ఆయన శిరస్సు నుండి ఒక దివ్యతేజం లేచి, ఆకాశం వైపుగా పోయి అదృశ్యమైంది. అదే సమయంలో బ్రాహ్మణుడు కాశీ నుండి లింగాన్ని తేవడం జరిగింది. పుదుక్కోట ప్రభువు అక్కడ ఆలయం కట్టించాడు. లింగ ప్రతిష్ట జరిపించాడు. సమాధి మీద బిల్వ వృక్షాన్ని నాటించాడు. ఇప్పటికీ పుదుక్కోటలో  పూజలు కొనసాగు తున్నాయి. జేష్ఠ శుద్ధ దశమి నాడు ఉత్తరాదిన పండితరాయల పూజ, దక్షిణాదిన సదాశివ యతి పూజ… ఇద్దరు తెలుగులను పూజ్య లింగములుగా చేస్తూ పూజించే పుణ్యదినం కావడం విశేషం.

రామకిష్టయ్య సంగనభట్ల

సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్.

9440595494

Latest News

వాన‌ల‌తో.. జ‌ర పైలం

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడండి అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి యూరియా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS