- బీసీ రిజర్వేషన్లపై డ్రామా కాదు, రాజ్యాంగబద్ధ పోరాటం జరగాలి
- దాసోజు, వకుళాభరణం ఆగ్రహం
రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీలో రాజకీయ నాటకాలపై దృష్టి సారించడం తప్పుపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై డా. దాసోజు శ్రవణ్, డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, “రాష్ట్రపతికి పంపిన బిల్లులు పెండింగ్‌లో ఉన్న తరుణంలో ఆర్టికల్ 213 కింద ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధం. నిజమైన పోరాటం చేస్తే అన్ని పార్టీలు కలిపి అధికారిక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. కానీ ఇష్టం ఉన్నవారిని మాత్రమే తీసుకెళ్లడం రాజకీయ డ్రామా తప్ప మరోటి కాదు” అని మండిపడ్డారు. అలానే, “బీసీ రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేయాలని ఎన్నోసార్లు సూచించినా, ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. బీసీ కుల సంఘాల ప్రతినిధులు, మేధావులతో నిష్పాక్షికంగా చర్చ ఎందుకు జరగలేదు?” అని ప్రశ్నించారు.
ఈ విషయంపై డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ, “సోనియా గాంధీ పంపిన సాధారణ లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్కార్, నోబెల్ అవార్డులతో పోల్చడం శోచనీయం. ఆ లేఖలో ఒక్క ప్రశంసా పదం లేకపోయినా దాన్ని అనవసరంగా గొప్పగా చూపడం తెలంగాణ ప్రతిష్టను దిగజార్చిన చర్య” అని వ్యాఖ్యానించారు. అలాగే, బుసాని కమిషన్ సిఫార్సులు, సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి మరియు కుల సర్వే నివేదికలను అసెంబ్లీ కౌన్సిల్‌లో టేబుల్ చేయకుండా ఉంచడం ఘోర తప్పిదమని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ చట్టబద్ధంగా నియమించబడిందా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ ప్రజల ముందుకు రాకపోవడం అనేది పారదర్శకత లేకపోవటానికి నిదర్శనమని విమర్శించారు.
“సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి మరియు కుల సర్వేకు చట్టబద్ధత లేకపోవడం, ఆర్టికల్ 340 కింద స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయకుండా సాగుతున్న ఈ ప్రక్రియలు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకులు కలిగించే ప్రమాదం ఉంది. న్యాయస్థానాలు తిరస్కరిస్తే ఇప్పటికే అమలులో ఉన్న రిజర్వేషన్లకు కూడా విఘాతం ఏర్పడుతుంది” అని వకుళాభరణం హెచ్చరించారు.