- బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
- ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్నం ప్రకాశ్ తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎన్నం ప్రకాశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టత లేకుండా రాజకీయ లాభం కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీసీ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా అమలు చేయలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పట్టించుకోలేదు. బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారో ఇప్పటిదాకా స్పష్టంగా సమాధానం ఇవ్వటం లేదని అన్నారు. కులగణనలో బీసీల సంఖ్య తగ్గిపోవడం గురించి కూడా రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ప్రకాశ్ డిమాండ్ చేశారు. బీసీ హక్కుల విషయంలో బీజేపీ నాయకులు రామచంద్రరావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలుమార్లు సరైన సూచనలు చేసినా కాంగ్రెస్ వాటిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
“42% రిజర్వేషన్లలో 10% ముస్లింలను కలపకూడదు. బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధితో ఉంటే వెంటనే బిల్లు ఆమోదించి గవర్నర్, రాష్ట్రపతి వద్దకు పంపాలని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఎదిగారు. కానీ కాంగ్రెస్ నాయకులు గాంధీ కుటుంబం ఆధారంతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్ రెడ్డి 2023లో ముఖ్యమంత్రిగా అవ్వడం వెనుక ఎంతమంది మోచేతి నీళ్లు తాగారో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, అందుకే ప్రజలు వారి వైఖరిపై విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు. బీసీ బిల్లు ఆమోదం కాకపోతే మోదీని ఇంటికి పంపిస్తా అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎన్నం ప్రకాశ్ హేయంగా అభివర్ణించారు. గతంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల తీర్పు ఎదుర్కొన్నారని, ఇప్పుడు రేవంత్ కూడా అదే దారిలో నడుస్తున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బీసీ బిల్లు ఆమోదమవుతుందని రేవంత్ చెప్పడాన్ని ప్రశ్నించిన ఆయన, గతంలో మీ పార్టీకి చెందిన ప్రధానులైన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ బీసీల కోసం ఏ చర్యైనా తీసుకున్నారా? ఒక్క ఉదాహరణ చూపగలరా?” అని సవాలు విసిరారు. బీసీ ర్యాలీలకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరవడం బీజేపీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన అన్నారు. “బీసీ హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ ఎప్పటినుంచో లౌకికంగా, రాజ్యాంగబద్ధంగా మాట్లాడింది. ప్రధాని నరేంద్ర మోదీ బీసీల పక్షపాతిగా పనిచేశారు. ఇది చరిత్రకు సాక్ష్యం,” అని ఎన్నం ప్రకాశ్ స్పష్టం చేశారు.