- 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్ ప్రారంభం
- ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పనులకు శంకుస్థాపన
- రూ. 950 కోట్లతో నిర్మించే టౌన్‌షిప్ పనులు
- 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్న యూనిట్లు
- మిగిలిన యూనిట్ల పనులు జనవరి 26నాటి పూర్తి
- నిర్వాసితులకు విద్యా, వైద్య సదుపాయాల హామీ
- యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శనలో మంత్రులు
- పాల్గొన్న మంత్రులు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, మండలి చైర్మన్ గుత్తా తదితరులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో వచ్చే జనవరి 26 నాటికి పూర్తిస్థాయి విద్యుత్ (4000 మెగావాట్ల) ఉత్పాదన అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో కలిసి యాదాద్రి పవర్ ప్లాంట్ లో 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన యూనిట్ -1ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సుమారు 35 వేల కోట్ల రూపాయలతో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్లు మొత్తంగా 4000 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం కలిగిన అతిపెద్దదైన విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పటికే యూనిట్- 2 ను గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాగా శుక్రవారం రెండో యూనిట్ ను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. మిగిలిన 3, 4, 5 యూనిట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఒక యూనిట్, డిసెంబర్ నాటికి మరో యూనిట్, జనవరి 26 వరకు మిగిలిన యూనిట్ ను పూర్తి చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించనున్నట్లు తెలిపారు.

ముందుగా హెలికాప్టర్‌లో ప్లాంట్ కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులు 971.98 కోట్ల రూపాయలతో వైటిపిఎస్ పరిధిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. వన మహోత్సవం లో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం పనులు పురోగతిపై వైటీపీఎస్ సమావేశం మందిరంలో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని యూనిట్లను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా జెన్కో, బిహెచ్ఇఎల్ అధికారులు పనుల ప్రాధాన్యత క్రమంలో విభజించుకొని సకవులంలో పూర్తిచేసేలా కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వం వైటీపీఎస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్లాంట్ ఆగిపోయే పరిస్థితి వచ్చిందని, వైటిపిఎస్ నిర్మాణ వ్యయం అధికంగా పెరిగిపోయిందని, భూ నిర్వాసితులకు సకాలంలో పరిహారం కూడా అందచేయలేని దుస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తమ ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలపై పడే భారాన్ని తగ్గించాలని క్షేత్రస్థాయిలో యాదాద్రి ప్లాంట్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర పర్యావరణ శాఖ నుండి అనుమతులు పొంది, రెండవసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు సూచన చేస్తూ నిర్ణీత సమయానికే ప్లాంట్ లో విద్యుత్ ఉత్పాదనకు సిద్ధం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అధికారులు కూడా నిర్దేశించిన సమయానికి రెండు యూనిట్లు పూర్తి చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఉద్యోగులు సిబ్బంది కోసం ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లో సకల వసతులతో భవనాలు నిర్మించడంతోపాటు సౌకర్యాలు కల్పించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, ఆసుపత్రులు నిర్మించి ప్లాంట్ సిబ్బంది ఉద్యోగులకే కాకుండా సమీప గ్రామాల ప్రజలకు మేలు జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. డిఏవి పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు. వైటిపిఎస్ భూ నిర్వాసితులతో పాటు, పులిచింతల భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందజేయడంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే కొందరికి ఉద్యోగాల కల్పన చేయడం జరిగిందని, మిగిలిన వారికి ఆగస్టు 15 నాటికి ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు. బొగ్గు బూడిద లారీలతో రోడ్లు దెబ్బతిన్న కారణంగా సిసి రోడ్లు మంజూరు చేశామని యుద్ధ ప్రాతిపదికన వాటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నష్టపరిహారం పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.

రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే 93 కిలోమీటర్ల విష్ణుపురం డబల్ రైల్వే లైన్ మంజూరు కావడం జరిగిందని, కేంద్రం సకాలంలో నిధులు విడుదలచేయకపోవడంతో పనులు మాత్రం పూర్తి కాలేదని అన్నారు. యాదాద్రి ప్లాంట్ నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, సకాలంలో పూర్తి అయ్యేలా కృషి చేస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జిల్లా మంత్రిగా జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్లాంట్ వరకు రహదారుల నిర్మాణానికి 250 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాక, అన్ని క్లియరెన్స్ లు ఇచ్చినట్లు తెలిపారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వైటిపిఎస్ ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎలాంటి సహకారం అందించడం లేదని అన్నారు. దీనిపై రాష్ట్ర అయిందన్న శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ స్పందిస్తూ గత ప్రభుత్వ హయాంలోనే సిఎస్ఆర్ కింద నిధులు విడుదల చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. వైకిపీఎస్ లోని అన్ని విభాగాలలో ప్రతి ఉద్యోగి కార్డుతోనే యాక్సెస్ అయ్యేవిధంగా ఆన్‌లైన్ నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. నిర్దేశించిన గడువు ప్రకారం అన్ని యూనిట్లను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. జెన్‌కో సిఎండి డాక్టర్ హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైటిపిఎస్ ప్రస్తుత పరిస్థితిని మంత్రుల బృందానికి వివరించారు. కంట్రోల్ యూనిట్లు, రైల్వే లైన్, ఇతర పనులపై పూర్తి వివరాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, హైటెక్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి, జెన్‌కో సివిల్ డైరెక్టర్ అజయ్, జెన్‌కో హెచ్ఆర్ డైరెక్టర్ వి. కుమార్ రాజు, వైటిపిఎస్ పర్యవేక్షణ అధికారులు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.