Friday, August 22, 2025
spot_img

నిరాశ మిగిల్చిన పార్లమెంట్ సమావేశాలు

Must Read
  • ఇండియా, ఎన్డీయే కూటములు బీసీలను నిండాముంచాయి..
  • బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలి
  • సచివాలయం మీడియా పాయింట్ వద్ద జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు బీసీలకు తీవ్ర నిరాశ మిగిల్చాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు జరిగిన నెలరోజుల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కనీసం చర్చ జరగకపోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని సచివాలయం మీడియా పాయింట్ వద్ద గురువారం మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. ఆ తరువాత రెండు సార్లు ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ధర్నా చేసినప్పటికీ, పార్లమెంటులో చర్చ జరగకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

“ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, బీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇద్దరూ బాధ్యతగా స్పందించకపోవడం వల్ల బీసీల పట్ల ఎవరికీ చిత్తశుద్ధి లేదనే భావన బలపడింది” అని జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లను కలసి బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో పోరాటం చేయాలని విజ్ఞప్తి చేసినా, నెలరోజులపాటు జరిగిన సమావేశాల్లో ఒక్కరోజైనా ఆ అంశాన్ని ఎజెండాగా తీసుకోలేదని ఆయన మండిపడ్డారు.

“తెలంగాణకు చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని కోరుతూ లోక్‌సభలో కొంతమేర ఆందోళన చేసినా, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ వంటి జాతీయ నాయకత్వం మద్దతు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలా స్పందిస్తుందో?” అని ప్రశ్నించారు.

ఇండియా కూటమి నేతలు బీహార్ అంశాన్ని తప్ప తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అలాగే ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు ఎవరూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్‌లో ప్రకటన చేయకపోవడం వారి బీసీ వ్యతిరేక వైఖరిని సూచిస్తోందని పేర్కొన్నారు.

“ఇండియా, ఎన్డీఏ కూటములను బండకేసి కొట్టి, బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తెలంగాణ బీసీ సమాజం పోరాటం చేస్తుంది. 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. లేనిపక్షంలో బీసీలు సహించబోరు” అని జాజుల హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సంధ్య, జగదీష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS