Monday, July 7, 2025
spot_img

విచ్చలవిడిగా కొనసాగుతున్న నకిలీ ఔషధాల దందా..

Must Read
  • జబ్బు తగ్గడం మాట సరే.. ప్రాణాలకే ముప్పు..!
  • ఇద్దరు ఔషధ డిస్ట్రిబ్యూటర్ల అరెస్ట్.. ఔష‌దాల స్వాధీనం
  • నకిలీ రోస్ వాస్ ఎఫ్ 20, రోస్ వాస్ 10 మాత్రల సరఫరా..
  • నకిలీ ఓషధాలను స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు..
  • దేశ రాజధాని ఢిల్లీ నుంచి సరఫరా అయ్యాయని సమాచారం..
  • కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు భావిస్తున్న అధికారులు..
  • కొరవడిన డ్రగ్స్ నియంత్రణ.. లంచాల మత్తులో కొంద‌రు అధికారులు..
  • ఎన్ని ప్రాంతాలకు సరఫరా జరిగాయి..? ఎన్ని లక్షల మంది ఉపయోగించారు..?
  • అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఔషధ తయారీ కంపెనీలు..
  • దందా ఎప్పటినుంచో జరుగుతోందని ఒప్పుకున్న సన్ ఫార్మాస్యూటికల్స్ ప్రతినిధి..

మనుషులను రోగాల బారినుంచి కాపాడి వారికి ఆరోగ్యాన్నివ్వడానికి ఓషధాలు తయారు చేస్తారు.. ఆ తయారీ విధానం కూడా ఎంతో పకడ్బందీగా ఉంటుంది.. సరైన వాతావరణం.. అనువైన పరిసరాలు.. అధునాతన మిషనరీ.. అనుభవం ఉన్న వైద్య నిపుణులు, డ్రగ్స్ తయారీలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు, కెమిస్ట్ లు ఇలా ఎంతో నైపుణ్యంతో, ఎంతో జాగ్రత్తతో ఔషధాలు తయారు చేస్తారు.. ఏమాత్రం తేడా ఉన్నా ఆ మందులు వికటించి ప్రమాదం ఉంటుంది.. అన్ని పరిశీలనలు జరిగిన తరువాత, సర్టిఫైడ్ అయిన తరువాత ఆయా మందులు ప్యాక్ చేయబడి, దానికి బ్యాచ్ నెంబర్లు వేసి.. అటు తరువాత కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కి చేరవేస్తారు.. సదరు డిస్ట్రిబ్యూటర్స్ తమ ప్రాంతం లోని హోల్ సేల్, రిటైల్ షాపులకు సరఫరా చేస్తారు.. ఈ షాపుల మీద డ్రగ్స్ కంట్రోల్ శాఖ నియంత్రణ ఉంటుంది.. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంటారు.. ఇంత జరుగుతున్నా నకిలీ మందులు సరఫరా అవుతూనే ఉన్నాయి.. జనాల్లోకి వెళ్తూనే ఉన్నాయి.. ప్రాణాలకు ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి.. ఈ ప్రక్రియను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎంతమేర కృషి చేస్తున్నాయో అర్ధంకాని పరిస్థితి నెలకొని ఉంది.. కారణం ఏమిటంటే ఈ మందుల తయారీ కంపెనీలు, డిస్టిబ్యూటర్లు, హోల్ సెల్, రిటైల్ షాపులు, కొందరు రాజకీయ నాయకుల గుప్పిట్లో ఉంటాయి.. కార్పొరేట్ ఆసుపత్రులను సైతం వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు.. చట్ట సభల్లో చట్టాలు చేసి అమలు చెయ్యాల్సిన నాయకులే ఇలాంటి నకిలీ దందాలు చేస్తుంటే ఇక రక్షించేవారెవ్వరు.. అమాయకులను కాపాడేవారెవ్వరు..?

ఇప్పుడు తాజాగా సన్ ఫార్మాస్యుటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఔషధ తయారీ సంస్థపై వ‌స్తున్న వార్తలు సంచలనం రేపుతోంది.. కాగా ఈ కంపెనీ పేరుతో నకిలీ మందులను తెప్పించి సరఫరా చేసిన ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యజమానులు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం..

నగరంలోని కోఠీలో ఓ రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నకిలీ ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆ ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై దాడిచేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, సుల్తాన్ బజార్, ఇందర్ బాగ్, కోఠీ యజమాని ప్రవీణ్ కుమార్ కనోడియా, అదేవిధంగా.. శ్రీ నందినీ ఫార్మా, విట్టల్ మారుతి లేన్, గుజరాత్ గల్లీ, సుల్తాన్ బజార్ కోటి, యజమాని మిథింటి శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు.. అయితే వీరు ఎంతో పేరు ప్రఖ్యాతులున్న సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తయారు చేసిన ఔషధాలు ‘రోసువాస్ ఎఫ్ 20’, ‘రోసువాస్ ఎఫ్ 10’ టాబ్లెట్లు అంటే రోసువాస్టాటిన్, ఫెనోఫైబ్రేట్ టాబ్లెట్లను, వేరే కంపెనీల ద్వారా అదే పేరుతో న‌కిలీ టాబ్లెట్లు సరఫరా చేసినట్లు రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల వారు అంగీక‌రించారు. ఈ నకిలీ మందులను స్వాధీనం చేసుకున్న అధికారులు ఈ ఇద్దరు డీలర్లపై కేసును నమోదు చేశారు..

సన్ ఫార్మా పేరుతో తయారైన నకిలీ ఔషదాలు ఇవే

అనంతరం వీరిని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, నాంపల్లి, హైదరాబాద్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కేసును పరిశీలించిన జడ్జ్ ఈ ఇద్దరు నిందితులకు 14 రోజుల పాటు అంటే జూలై 9, 2025 వరకు రిమాండ్ విధించారు.. దీనితో వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించడం జరిగింది..

కాగా అధికారులు స్వాధీనం చేసుకున్న రోసువాస్ ఎఫ్ 20, రోసువాస్ ఎఫ్ 10 టాబ్లెట్లు రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి.. గుండె సంబంధిత సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారని తెలుస్తోంది.. అయితే ఈ మెడిసిన్ అసలు తయారీ దారైన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి సంబంధిత అసలు బ్యాచ్‌లతో వీరు ఈ ట్యాబ్లేట్స్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.. దాడులు నిర్వహించిన అధికారులు పట్టుబడ్డ ఈ ట్యాబ్లేట్స్ నకిలీవి అని గుర్తించారు.. ఇదే విషయాన్ని సన్ ఫార్మాస్యుటికల్స్ ఇండస్ట్రీస్ వారు కూడా నిర్ధారించినట్లు తెలుస్తోంది..

నకిలీ ఔషధం దొరికిన తరువాత అమ్మిన తాలూకు ఆదారం

కాగా, రెండు ఔషధ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపై చ‌ర్య‌లు తీసుకోకుండా, నేటికి ఆ కంపెనీలు మార్కెటింగ్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనికి కొంద‌రు అధికారులు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు తెలుస్తుంది.. అయితే.. ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పూర్తిగా మూసివేయ‌కుంటే మ‌రెంతో మంది అమాయ‌కుల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయే ప్ర‌మాదం లేక‌పోలేదు.. కావున వెంట‌న అధికారులు స్పందించి ఆయా డిస్ట్రిబ్యూషర్ల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకొని, వాటిని పూర్తిగా మూసివేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

నకిలీ ఔషధం దొరికిన తరువాత ఓపెన్ చేసి యదేచ్ఛగా నడుపుతున్న దందా

ఇలాంటి వ్యవహారాల్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయానికి సమాచారం అందించాలని అధికారులు సూచించారు.. అలాగే టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 కు కాల్ చేసి తెలియజేయవచ్చని డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ షాహనావాజ్ ఖాశీమ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు..

ఓపెన్ చేసి నడుపుతున్న నకిలీ ఔషధాల ఏజెన్సీ గంగా ఫార్మా

కాగా ఇదే విషయమై ఆదాబ్ ప్రతినిధి సంబంధిత సన్ ఫార్మాస్యుటికల్స్ ఇండస్ట్రీస్ ప్రతినిథిని సంప్రదించగా.. ఇవన్నీ మాకు సంబంధం లేదు.. డ్రగ్స్ కంట్రోల్ అధికారులను అడగండి అనిచెబుతూనే.. ఢిల్లీ నుంచి మా కంపెనీ తయారు చేసినట్లుగా మెడిసిన్ నకిలీ మెడిసిన్ తయారు చేసి, మేము వేసినట్లు గానే బ్యాచ్ నెంబర్స్ వేసి సరఫరా చేసినట్లు తెలిపారు.. ఈ విధంగా కొన్ని ఏళ్లుగా ఈ దందా నడుస్తోందని.. కొన్ని కోట్ల రూపాయల స్కాం జరుగుతోందని చెప్పడం జరిగింది.. ఈ నకిలీ దందా పై సన్ ఫార్మా కంపెనీ ఎంక్వయిరీ మొదలు పెట్టగా ఢిల్లీలో ఒక వ్యక్తి దొరికాడని.. ఆవ్యక్తి యూపీ నుంచి ఈ మందులు కొన్నామని.. అలాగే హైదరాబాద్ కి సప్లై చేశామని తెలిపినట్లు ఆయన చెప్పడం జరిగింది.. ఇది దేశమంతా జరుగుతోందని ఆయన చెప్పడం గమనార్హం.. మరి ఎప్పటికి ఈ నకిలీ ఔషధాల దందా మూతపడుతుంది..? అమాయకుల ప్రాణాలు రక్షించబడతాయి అన్నది ప్రశ్నార్థకమే.. దారుణం ఏమిటంటే.. డిస్ట్రిబ్యూటర్స్ ఎంతమందికి సరఫరా చేశారు.. ఈ ట్యాబ్లేట్స్ ని ఎన్ని రకాలుగా ప్రమోట్ చేశారు.. ఎంతమంది డాక్టర్లు రోగులకు రాసి ఇచ్చారు.. ఎంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అన్నది తలుచుకుంటే ఆందోళన కలుగక మానదు..

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS