- కేసును స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారించాలి
- నిజమైన నిందితులపై చర్యలు తీసుకోవాలి
- లేకపోతే ఓపి సేవలు నిలిపేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం
- సీఐ భీమ్ కుమార్ పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రైవేటు డాక్టర్ల అసోసియేషన్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా గ*జాయితో ఓ ప్రైవేటు వైద్యుడు పట్టుబడ్డ ఘటన కలకలం రేపింది. పట్టణంలో ఓ యువ డాక్టర్ కారులో రెండు 65 గ్రాముల గ*జాయి ప్యాకెట్లు పోలీసుల తనిఖీ లో దొరికిన సంఘటన పలు అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేస్తుండగా స్థానిక అతిర అనే ప్రైవేట్ ఆసుుపత్రి నిర్వాహకుడు డాక్టర్ ప్రదీప్ గౌడ్ కారులో 65 గ్రాముల రెండు గ*జాయి ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఓ సినిమా ఫక్కీలో జరిగిన నాటకమని స్థానిక ప్రజాప్రతినిధులు, డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ వికారాబాద్ పట్టణంలోని ప్రైవేటు డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి సీఐ భీమ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. సిఐ దురుద్దేశ్యంతో డాక్టర్ పై తప్పుడు కేసు మోపి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

పట్టణంలో ఐదు సంవత్సరాలుగా చిన్న పిల్లల డాక్టర్ గా సేవలందిస్తూ ప్రజల మన్నలు పొందుతున్న ప్రదీప్ గౌడ్ కేసును నిజాయితీగా విచారణ జరిపి, నిజమైన నిందితుల పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ కారులో గ*జాయి ప్యాకెట్లు వేసి సినిమా పక్కిలో కేసు నమోదు చేయించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే వికారాబాద్ లోని అన్ని ఆసుపత్రులలో ఓపి సర్వీస్ లను నిలిపేసి, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వికారాబాద్ జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సత్యానంద్, వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ తో పాటు పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు, తదితరులు డిమాండ్ చేశారు..
