నాలుగు గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులో మరోసారి గేట్లు ఎత్తివేశారు. ఈ సీజన్‌లో మూడోసారి గేట్లు ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు, ప్రస్తుతం నాలుగు స్పిల్‌వే గేట్ల ద్వారా వరద నీటిని నాగార్జునసాగర్‌కు తరలిస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహాలతో, శ్రీశైలం జలాశయానికి నిమిషానికి 2,02,456 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అదే సమయంలో 2,09,199 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో పోతిరెడ్డిపాడు హెచ్ రెగ్యులేటర్ ద్వారా 35 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,808 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. నాలుగు స్పిల్‌వే గేట్ల ద్వారా మాత్రమే 1,08,076 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.70 అడుగుల వద్ద నిల్వ ఉందని, మొత్తం సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను 202.96 టీఎంసీల నీరు మిగిలి ఉందని వివరించారు.