హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల అక్రమ వినియోగంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో స్పష్టమైన వివరాలు వెలుగులోకి రావాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ అవసరమని అధికారులు భావిస్తున్నారు. జగన్ మోహన్‌రావు అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ.240 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ప్రస్తుతం అసోసియేషన్ ఖాతాలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే మిగిలి ఉండగా, మిగతా రూ.200 కోట్లు గత 20 నెలల్లో ఖర్చైనట్లు గుర్తించారు. ఆ నిధులను ఎక్కడ, ఎలా వినియోగించారో వెలికి తీయడానికి ఫోరెన్సిక్ ఆడిట్‌ను సీఐడీ సిఫార్సు చేసింది.
ఇది హెచ్‌సీఏలో జరుగుతున్న మూడో ఫోరెన్సిక్ ఆడిట్. 2014 తర్వాత ఇప్పటికే రెండు సార్లు ఇలాంటి పరిశీలన జరిగింది. తాజా ఆడిట్‌లో, నకిలీ బిల్లుల ద్వారా బీసీసీఐ గ్రాంట్లు మరియు అసోసియేషన్ నిధులను కొంతమంది దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా తేలిందని సీఐడీ అధికారులు తెలిపారు.
ఈ కేసులో హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ రామ్‌చందర్ రెండో నిందితుడిగా ఉన్నాడు. పుణెలో గత నెల 25న ఆయనను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో ఈ నెల 7 నుంచి 13 వరకు కస్టడీలో ఉంచి కీలక సమాచారాన్ని సేకరించారు.