- 101 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి
- సిపిఎ ఏర్పాటు, ఉద్యమాల్లో కీలక భూమిక
- భూస్వాములపై పోరాటంలో అలుపెరగని నేతగా గుర్తింపు
కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గత నెల 23న గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎంగా పనిచేసారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. 1923 అక్టోబరు 20న కేరళలో వెనకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్.. లెనిన్, స్టాలిన్, మావోల జీవితాలతో పాటు.. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలకఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేత. బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేసి… దర్జీ దుకాణంలో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ.. జీవనం సాగించిన అచ్యుతానందన్ కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. స్వాతంత్య్రానికి ముందున్న ట్రావెన్‌కోర్ సంస్థానంలో భూస్వాములపై పోరాటంలో భాగంగా జైలుకెళ్లటంతో ఆరంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ప్రజా నేతగా ముఖ్యమంత్రి స్థాయికి చేరింది. 1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ను వదిలేసి.. సీపీఎం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.

1967 నుంచి 2016 దాకా కేరళ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఒకసారి (2006-2011) ముఖ్యమంత్రిగా, మూడుసార్లు విపక్షనేతగా వ్యవహరించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో ఎన్నడూ వెనకంజ వేయని అచ్యుతానందన్… రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపైనా ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం మోపారు. ఈ చర్యలతో అనేకమంది వ్యతిరేకమైనా ఆయన వెరవలేదు. ప్రజలు.. పార్టీ మధ్య అంతరం వచ్చినప్పుడు మార్క్సిస్టు పార్టీ క్రమశిక్షణనూ పక్కనబెట్టి ప్రజల పక్షాన నిలబడటానికే పెద్దపీట వేశారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనా తన నిజాయితీబాటను, నిరాడంబరతను ఏనాడూ వీడలేదు. పుట్టింది 1923లో అయినా… ఆధునిక అవసరాలను కూడా అర్థం చేసుకున్న నిత్య అధ్యయనశీలి. పాతతరంలో భూమి కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైనట్లుగా… సాంకేతిక ప్రపంచంలో సాప్ట్‌వేర్‌ల రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సాగుతోందని గుర్తించిన ఆయన… అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ సాప్ట్‌వేర్ కోసం ఉద్యమించారు. 2016లో తన 93వ ఏట కూడా కమ్యూనిస్టులకు వీఎస్ విజయవీచిక అయ్యారు.
