- ఇతర దేశాలపై ఆధారపకుండా సాగాలి
- ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు
భారత్ కూడా అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందని ప్రధాని మోడీ మరోమారు ఉద్ఘాటించారు. అందువల్ల ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతోందని మోదీ తెలిపారు. అంతేకాదు.. ట్రంప్ టారిఫ్‌ల వేళ స్వదేశీ ఉత్పత్తులను పెంచాలంటూ పిలుపునిచ్చారు. భారత్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ’డెడ్ ఎకానవిూ’ అంటూ ఆయన చేసిన విమర్శలపై భారత ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా స్పందించారు.




ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వారణాసిలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిన నెలకొంది. అన్ని దేశాలు తమ తమ సొంత ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనబెట్టి ’స్వదేశీ’ ఉత్పత్తుల విప్లవానికి నడుంకట్టాలి. కేవలం భారతీయులు తయారుచేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
ఇటీవల భారత్-రష్యా బంధంపై ట్రంప్ స్పందిస్తూ.. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చు కోనీయండని, కలిసి మునగనీయండని విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంతకుముందు న్యూఢిల్లీపై 25శాతం సుంకాలు విధించిన అగ్రరాజ్యాధినేత.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తే అదనంగా పెనాల్టీలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.