సిబిఐ అభిప్రాయం కోరిన సుప్రీం
మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ, సునీత సవాల్ చేశారు.సీబీఐ అభిప్రాయం చెప్పాక అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందా? లేదా? కోర్టుకు చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టుపైనా సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా? అని సీబీఐ అభిప్రాయాన్ని న్యాయస్థానం అడిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె సునీత, సీబీఐ పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది.