మాజీలకు ఇక్కడే వసతి
ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న జగదీప్ ధన్‌ఖడ్‌కు కేంద్ర ప్రభుత్వం టైప్ 8 ప్రభుత్వ నివాస బంగళాను కేటాయించింది. ల్యూటియన్స్ ఢిల్లీ ప్రాంతంలో ఉండే టైప్-8 భవనాలు మాజీ ప్రధాని, మాజీ రాష్ట్రపతుల కోసం ఉద్దేశించినవి. ఇప్పుడు ధన్‌ఖడ్‌కు కూడా ఇక్కడే కేటాయించారు. అత్యున్నత స్థాయి ప్రభుత్వ నివాస బంగళాలను టైప్ 8గా వర్గీకరించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఈ కేటగిరీ భవనాలనే కేటాయించారు. మాజీ రాష్ట్రపతి, మాజీ ప్రధానులకు కూడా ఇవే భవనాలను ఇస్తారు. మాజీ రాష్ట్రపతులు ఈ భవనాల్లో తాము జీవించినంతకాలం ఉండేందుకు అనుమతి ఉంది. ఈ మేరకు ప్రెసిడెంట్ (ఫెసిలిటీస్) రూల్స్-1962లో ప్రత్యేక నిబంధనలను చేర్చారు. పదవి నుంచి దిగిపోయిన వెంటనే మాజీ రాష్ట్రపతికి ఈ భవనాన్ని కేటాయిస్తారు.
రాష్ట్రపతి పదవికి ఉన్న ప్రాముఖ్యత, హోదా, భద్రతావసరాల రీత్యా మాజీ రాష్ట్రపతులకు ఈ బంగళాల్లో జీవితకాలం పాటు ఉండేందుకు అనుమతినిచ్చారు. ఇక ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థకు అధినేత అయిన ప్రధానికి కూడా రిటైర్మెంట్ తరువాత -టైప్ 8 భవనాన్ని కేటాయిస్తారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలతో జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తారు. మాజీ ప్రధానికి కూడా తన జీవితకాలమంతా టైప్ 8 భవనంలో నివసించేందుకు అనుమతి ఉంది. అయితే, మాజీ ఉప రాష్ట్రపతులకు శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ నివాస భవనాలు కేటాయించే నిబంధనలు ఏవీ ప్రస్తుతం లేవు. కానీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చినప్పుడు మాజీ ఉపరాష్ట్రపతులకు టైప్-8 భవనం కేటాయించే అవకాశం ఉంది. ఈ భవనాన్ని ప్రభుత్వ సూచనల మేరకు ఖాళీ చేయకపోతే మార్కెట్ రేటు ప్రకారం అద్దె చెల్లించాల్సి ఉంటుంది.