- మహాత్మా గాంధీ యూనివర్సిటీ పేరుతో భారీ మోసం!
- జోరుగా నకిలీ సర్టిఫికేట్ల దందా..
- మసకబారుతున్న విశ్వవిద్యాలయ ప్రతిష్ట
- నార్‌కేట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్న రిజిస్ట్రార్
- ముందుకు సాగని దర్యాప్తు.. జాప్యంపై అనుమానాలు
- నిందితులకు విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అధికారుల అండ
తెలంగాణలో విద్యావ్యవస్థను కుదిపేస్తున్న మరో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్‌తో ఉద్యోగం సంపాదించి, నెలల తరబడి జీతం తీసుకున్న ఓ మహిళ బాగోతం బట్టబయలైంది. ఈ ఘటన మహేశ్వరం మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఎస్. ఉమా మహేశ్వరి అనే మహిళ, ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ) పేరుతో ఒక నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్‌ను సృష్టించింది. దాని ఆధారంగా మహేశ్వరంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో వొకేషనల్ ట్రైనర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. ఆమె జనవరి 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు, సుమారు 16 నెలల పాటు విధుల్లో కొనసాగి, ప్రభుత్వ ఖజానా నుండి జీతం రూపంలో వేలాది రూపాయలు పొందింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూడటంతో విద్యాశాఖ అధికారులు, యూనివర్సిటీ వర్గాలు నివ్వెరపోయాయి.
యూనివర్సిటీ ఫిర్యాదుతో కేసు నమోదు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ మోసం బయటపడటంతో, మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి వెంటనే స్పందించారు. నకిలీ సర్టిఫికెట్‌తో యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు, ప్రభుత్వాన్ని మోసం చేసిన ఉమా మహేశ్వరిపై నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నెం. 115/2025 కింద కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాల తయారీ (ఫోర్జరీ), ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 336(2), 336(3), 340(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చార్జిషీట్‌లో జాప్యంపై అనుమానాలు
అయితే, ఈ కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నమోదై ఐదు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు చార్జిషీట్ దాఖలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కుంభకోణంలో ఉమా మహేశ్వరికి సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ రెడ్డి అనే వ్యక్తిని విచారించినప్పటికీ, తదుపరి చర్యలు మందగించాయి. నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
పోలీసుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “ఇలాంటి నేరస్తులను వదిలేస్తే, వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది. ఇది కేవలం ఒక ఉద్యోగాన్ని మోసపూరితంగా పొందడమే కాదు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమే” అని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఈ కుంభకోణం వెనుక ఉన్న పెద్ద తలలను కూడా బయటకు లాగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయడంతో పాటు, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. విద్యావ్యవస్థలో ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఉపేక్షిస్తే, భవిష్యత్ తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.