- కేవలం ముస్లింలకు మాత్రమే లబ్ది
- ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు
- బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది
- మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రిజర్వేషన్లతో నిజమైన బిసిలు నష్టపోతారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిసిలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..10 శాతం ఈబిసి రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారని తెలియజేశారు. 42 శాతం రిజర్వేషన్లతో బిసిలకు న్యాయం జరగదని చెప్పారు. బిసి రిజర్వేషన్ వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ది చేకూరుతుందని అన్నారు. బిసిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు. బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిదే అని కొనియాడారు. రాజకీయ లబ్ది కోసమే బిసి రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తుకుందని విమర్శించారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని మండిపడ్డారు.
అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని, నరేంద్ర మోడీ కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే బిసి జాబితాలో చేర్చిందని చెప్పారు. పెంచిన బిసి రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపోతే హైదరాబాద్ మెట్రో ఫేస్- 2 గురించి తెలంగాణ ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మధ్యనే డిపీఆర్ కేంద్రానికి వచ్చింది.. మెట్రోపై అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది.. మెట్రో గురించి కాంగ్రెస్ సర్కార్ ఇంకా సమాచారం ఇవ్వాల్సి ఉంది.. సీఎంకి మెట్రో గురించి అవగాహన లేదు.. మెట్రో లైన్ల నిర్వాహణ ఎవరు చేస్తారు.. నష్టాలు ఎవరు భరిస్తారు.. గతంలో ఇచ్చిన సంస్థకు రెండో దశ నిర్మాణ నిర్వాహణ ఇస్తారా.. కొత్త సంస్థ వస్తే వాటితో సమన్వయం ఒప్పందం అంశాలు కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. మెట్రో విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకారంతో పాటు నిధులను ఇస్తుంది.. మెట్రో విషయంలో కేంద్ర రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటుకు మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇక, నేను రాష్ట్ర అంశాలను అనేక సార్లు కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లాను అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వేసే పనికిరాని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను అని తేల్చి చెప్పారు. కేసీఆర్ ను కాపాడాలని రాహుల్ గాంధీ చూస్తున్నారు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య అవగాహన కుదిరింది.. ఇక, బండి సంజయ్ – ఈటల రాజేందర్ విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.