జమ్మూ–కాశ్మీర్ పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు ఘోర విషాదానికి కారణమయ్యాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం రెండో రోజు కూడా శోధన.. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 1,200 మంది ఉన్నారని ఒక భాజపా నేత అంచనా వేశారు. కిక్త్వాడ్ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృత స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు రాకపోకలు సాగించలేకపోవడంతో, సహాయక బృందాలు రహదారి మార్గం ద్వారా చేరుకుంటున్నాయి. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో పాటు సుమారు 300 మంది సైనికులు ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు బయటపడిన 21 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
జమ్మూలో మేఘ విస్ఫోటం కారణంగా మచైల్ మాతా దేవి యాత్రికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఒక్కసారిగా ఉప్పొంగిన వరద ప్రవాహాలు అనేక మందిని కొట్టుకుపోయాయి. పలు భవనాలు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ కారణంగా మచైల్ మాతా దేవి యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు.