- మంత్రి పదవిపై మరోమారు రాజగోపాల్ కస్సుబుస్సు
- ఇద్దరం అన్నదమ్ములం సమర్థులమే అని వ్యాఖ్య
- ఖమ్మంకు లేని నిబంధన నల్లగొండకే ఎందుకో
మంత్రి పదవి విషయంలో తనకుకావాలనే అన్యాయం చేయడంపై మరోమారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీనేతల తీరుపై విమర్శలు గుప్పించారు. కేబినేట్‌లో ఇద్దరు అన్నదమ్ములకు పదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నవారు, పార్టీలో ఇద్దరు ఉన్నారని ముందు తెలియదా అని కూడా ప్రశ్నించారు. మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మునుగోడు మండలం ఎలగలగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన నియోజకరవ్గం మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికి కూడా చెబుతున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హై కమాండ్ తనకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చింది, మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ.. అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని కోరారు. తనకు మంత్రి పదవి ఇస్తామన్నమాట ఆలస్య మైందని.. సమీకరణాలు కుదరటం లేదని ఇప్పుడు ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి ఇవ్వడం ఎందుకు కుదరటం లేదు.. ఆ సమీకరణలు రాకుండా ఎవరడ్డుకుంటున్నారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే సమయంలో మంత్రి పదవి ఇస్తాననే తీసుకున్నారని గుర్తుచేశారు. అప్పుడు తాము ఇద్దరం అన్నదమ్ములం కాంగ్రెస్‌లోనే ఉన్నామని తెలియదా అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తానని రెండోసారి హామీ ఇచ్చారని.. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో తాము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని గుర్తులేదా అని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా కొంతమంది నేతల పరిస్థితి ఉందని విమర్శించారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా అని ప్రశ్నించారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా అని నిలదీశారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమేనని, ఇద్దరం గట్టి వాళ్లమేనని.. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యమైనా సరే తాను ఓపిక పడుతానని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారు.. ఇచ్చినప్పుడు ఇవ్వండి. ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా? లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి హామీ ఇచ్చినప్పుడు తెలియదా? అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే.. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఆలస్యమైనా సరే ఓపిక పడుతున్నా? అని అన్నారు.