- కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా లోపించిన పారిశుధ్యం
- ఇలా ఉంటే విషజ్వరాలు రావా…?
- స్పంధించని అధికారులు..
అసలే వర్షాలు దీనికి తోడు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో జలమయం అవుతున్నాయి. రోడ్లపై పడిన గుంటల్లో వర్షపు నీరు చేసి దోమలకు ఆలవాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో అంటువ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో, రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం ఉండటంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పారిశుధ్యం పడకేసింది…అభివృద్ధి అటకెక్కిందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఆదాబ్‌హైద్రాబాద్ ప్రత్యేక కథనం…
జిల్లా వ్యాప్తంగా లోపించిన పారిశుధ్యం
జిల్లాలో ఒక కార్పోరేషన్, మూడు మున్సిపాల్టీలు, 22మండల కేంద్రాలు, 471గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో గ్రామాల్లో, పట్టణాల్లో ఎటుచూసినా మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోయింది. ప్రధాన రహదారులపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తోంది. ఆనీటిలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.గ్రామపంచాయతీలు, పట్టణాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా మారడం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పంచాయతీలో పాలకవర్గం లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదని జిల్లాప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇలా ఉంటే విష జ్వరాలు రావా….?
కొత్తగూడెం కార్పోరేషన్ పరిధిలో పారిశుధ్యం పడకేసింది. గ్రామాల్లో ఎటుచూసినా మురుగునీరుతో స్థంభించిపోతుంది.ప్రధాన రహదారులపై డ్రైనేజీ నీరుప్రవహిస్తుంది. ఈనీటిలోనే గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. అసలే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో గ్రామాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా మారడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్డుపైకి నీళ్లు, చెత్తాచెదారం పేరుకుపోతుంది. మురుగు పచ్చగా మారి దోమలు వృద్ధి చెందడంతోపాటు దుర్వాసన వెదజల్లుతుంది. పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని,రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తమ బాధలు వర్ణనానీతమని, తమ గోడు ఎవరికీ పట్టడం లేదని జిల్లాప్రజలు వాపోతున్నారు.
స్పందించని అధికారులు….
కార్పోరేషన్‌తో పాటు మున్సిపాల్టీలు, మండలాలు, గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం లోపించింది. జిల్లాలో రెండు రోజుల నుండి కురిసే భారీవర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతిరోజూ పారిశుధ్య పనులు నిర్వహిస్తూ ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులతోపాటు మండల, పంచాయతీ అధికారులు స్పందించి పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని జిల్లాప్రజలు కోరుకుంటున్నారు.