భయాందోళనలో శ్రీవారి భక్తులు
గత కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులను చిరుత పులులు సంచారం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు నడకదారులకు దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి అలిపిరి జూ పార్క్‌కు సమీపంలోనే చిరుత సంచరించింది. గురువారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ఫారెస్ట్ విభాగం ఏర్పాటు చేసిన ఇనుపకంచెను దాటి జూపార్క్ రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుంచి ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రి వరకు చేరుకుంది. రోడ్డుపక్కనే ఉన్న చిరుత పులిని చూసిన భక్తులంతా భయంతో పరుగులు పెట్టారు. పలువురు భక్తులు తమ సెల్‌ఫోన్లలో చిరుత పులిని వీడియో తీశారు. పలువురు భక్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు అక్కడికి చేరుకొని చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత సంచారం అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తున్నది. చిరుత సంచారం నేపథ్యంలో నడకదారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. చిరుతలు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు టీటీడీ అధికారులను కోరుతున్నారు.