భయాందోళనలో స్థానిక ప్రజలు
నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్‌లోని హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురు భాగంలో రోడ్డుపక్కన ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పడిన సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పక్కన ఉన్న జనం ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో ఉన్న వాహనదారులు, వ్యాపారులు ఆందోళనకు లోనయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం గమనార్హం. వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వాహనదారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ముందుగా హెచ్చరికలు జారీ చేసినట్లుగానే నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.