- కులు జిల్లాలో క్లౌడ్‌బరస్ట్, మలానా హైడ్రో ప్రాజెక్టు ధ్వంసం
- కాఫర్‌డ్యామ్ కుప్పకూలి భారీ వరదలు
- 30 మందికిపైగా చిక్కుకుపోయినట్లు అంచనా
హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రకృతి బీభత్సం ముంచెత్తింది. అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్‌బరస్ట్ కారణంగా మలానా నది ఉగ్రరూపం దాల్చింది. గట్టిగా కురిసిన వర్షానికి నది ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమవడంతో, మలానా-I హైడ్రోపవర్ ప్రాజెక్టుకు చెందిన కాఫర్‌డ్యామ్ పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనతో మలానా బ్యారేజ్ పూర్తిగా ధ్వంసమైంది. లోయ అంతటా భారీ శిథిలాలు, తెగిన వంతెనలు, కొట్టుకుపోతున్న వాహనాల దృశ్యాలు ఓ స్థానికుడు చిత్రీకరించాడు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, సుమారు 30 మంది వరదల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 4 నుంచి 5 మంది కార్మికులు హైడ్రో ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకుపోయారు. మరో 20 మందికి పైగా వరద ప్రభావిత గ్రామాల్లో బాహ్య సంబంధాలు కోల్పోయారు. వారు పాడుబడిన భవనాల్లో తలదాచుకుంటున్నప్పటికీ, ఆహారం, మంచినీరు లేని పరిస్థితి నెలకొంది.
ఎన్డీఆర్ఎఫ్, సహాయక బృందాల రంగప్రవేశం
ప్రమాద ఘటన విషయం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వరదల కారణంగా ప్రధాన రహదారులు ధ్వంసమైనందున, సహాయక సిబ్బంది అటవీ మార్గాల ద్వారా నడిచివెళ్లి ప్రభావిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అత్యవసర అవసరాలకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం వరద ఉధృతి కొనసాగుతుండగా, కొండచరియలు విరిగిపడే అవకాశం, మరిన్ని ఆకస్మిక వరదలు సంభవించే అవకాశమున్నట్లు అధికారులు హెచ్చరించారు. ఇప్పటి వరకు ఏవైనా ప్రాణనష్టాలు అధికారికంగా నమోదు కాలేదని, కానీ గల్లంతైనవారు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నష్టం మొత్తం స్థాయిని అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందని పేర్కొన్నారు.