- వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణ
- జనవరి 28న గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు
- 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం
- 31న వనప్రవేశంతో జాతరకు ముగింపు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది మేడారం మహా జాతర.. ఈ మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ మహా వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపింది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.

ఆపై 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు. ఈ తేదీల ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని భక్తులు జాతర ఏర్పాట్లకు సిద్ధమయ్యేందుకు మార్గం సుగమమైంది.