చేనేత అనేది భారతీయ సంప్రదాయానికి మూలస్థంభంగా నిలిచిన గొప్ప కుటీర పరిశ్రమ. పలు తరాలుగా చేతివృత్తిని జీవితంగా మలచుకున్న పద్మశాలీ, దేవాంగ, తొగట, తొగటవీర క్షత్రియ, పట్టుశాలి, జాండ్ర, స్వకులసాలి, కైకాల, కుర్ణి, కర్ణ భక్తులు, కరికాల భక్తులు, భవసార క్షత్రియ, నీలి, నీలకంఠ, నెస్సి, కురిమిచెట్టి, కత్రి, సెంగుందం వంటివారు ఈ రంగానికి ప్రాణంగా నిలిచారు. వారిపాలిటి జీవన శైలి, నైపుణ్య సంపద, సంస్కృతీ పరంపర ఈ రంగంలో ప్రతిఫలిస్తూ నేటికీ కొనసాగుతోంది. చేనేత నూలు దారాలు పడుగు (నిలువు వరుసలు) మరియు పేక (అడ్డు వరుసలు)గా మగ్గంపై నేతగా పోయి మృదువైన కళాఖండాలను జన్మనిస్తాయి. ఈ హస్తకళే “చేనేత”గా ప్రసిద్ధి చెందింది.
జాతీయ చేనేత దినోత్సవం 1905 సంవత్సరంలో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకోవడానికి జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది చేనేత కార్మికులు మరియు చేతివృత్తుల వారికి జీవనోపాధిని అందించే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత పరిశ్రమ గణనీయమైన పాత్ర పోషించింది, పోషిస్తుంది. ఈ రోజున, చేనేత ఉత్పత్తుల అందాలను ప్రదర్శించడానికి మరియు వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు నిర్వహిస్తారు. భారతదేశ దేశీయ సంస్కృతిని కాపాడటంలో చేనేత నేత కార్మికులు పోషించే పాత్రను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అత్యంత గొప్ప పాత్ర పోషించేదిగా చెప్పవచ్చు.
జాతీయ చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జరుపుకొంటారు. ఈ దినం శతాబ్దాలుగా భారతదేశ వస్త్ర పరిశ్రమకు వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికులకు ప్రత్యేకంగా భావించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందుకంటే ప్రపంచం పెరుగుతున్న పర్యావరణ సంక్షోభాన్ని మరియు స్థిరత్వం గురించి పెరుగుతున్న ఆందోళనలను ఎదుర్కొంటోంది. చేనేత నేయడం పవర్ లూమ్స్ (మరమగ్గాలు) ద్వారా తయారయ్యే వస్త్రాలకు పర్యావరణ అనుకూలమైన మరియు స్థిరమైన ప్రత్యామ్నాయం. భారతదేశంలోని లక్షలాది చిన్న-స్థాయి చేనేత కార్మికుల జీవనోపాధికి మద్దతు ఇస్తుంది.
పారిశ్రామికీకరణ మరియు సామూహిక ఉత్పత్తి పెరుగుదల అనేక మంది చేనేత కార్మికుల జీవనోపాధికి ముప్పు తెచ్చిపెట్టింది. చాలామంది తమ చేతివృత్తిని విడిచిపెట్టి ఇతర పనిని కనుగొనవలసి వస్తోంది. కావున జాతీయ చేనేత దినోత్సవం ఈ సంవత్సరం నుండి చేనేత ద్వారా తయారయ్యే వస్త్రాల ఉత్పత్తి మనుగడను పరిరక్షించడానికి మరియు దానిని సజీవంగా ఉంచే నేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకంగా నిలిచింది.
1905లో కలకత్తాలో బాల గంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్, మరియు బిపిన్ చంద్ర పాల్ వంటి ప్రముఖ నాయకులు ప్రారంభించిన స్వదేశీ ఉద్యమం జ్ఞాపకార్థం ఆగస్ట్ 7వ తేదీని ఎంచుకున్నారు. ఈ ఉద్యమం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం కోసం భారతదేశ పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించిన చేనేత వస్త్రాలతో సహా భారతీయ నిర్మిత వస్తువులను ఉపయోగించాలని సూచించింది. భారతదేశంలో చేనేత నేయడం గురించిన మొట్టమొదటి సూచనలు సుమారు క్రీ.పూ. 1500 నాటివి. పత్తి, పట్టు మరియు ఉన్ని నుండి వస్త్రాన్ని నేయడం, సహజ వర్ణద్రవ్యాలను ఉపయోగించి బట్టలకు రంగులు అద్దడం గురించి వాటిలో వివరించబడింది.
శతాబ్దాలుగా, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతూనే ఉంది. చేనేత కార్మికులు కొత్త పద్ధతులు, నమూనాలు మరియు సామగ్రిని సృష్టిస్తూ వారి ప్రత్యేకతను, నైపుణ్యాన్ని అభివృద్ధి చేశారు, చేస్తున్నారు.