- తెలంగాణ ఆత్మగౌరవం రేవంత్ తాకట్టు పెట్టారు..
- మండిపడ్డ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
బీసీ రిజర్వేషన్ల అంశం, సోనియా లేఖపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పట్నం వివేకానంద, బీఆర్‌ఎస్ నేత క్యామ మల్లేశ్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ వ్యాఖ్యలను ఘాటుగా తప్పుబట్టారు. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాసిన లేఖను తనకు ఆస్కార్ లాంటిదని రేవంత్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. అందులో ఆమె కేవలం పవర్ పాయింట్ సమావేశానికి తాను హాజరు కాలేనన్న అంశాన్ని మాత్రమే ప్రస్తావించిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ గాంధీ కుటుంబానికి చిరునవ్వులు పండించే ప్రయత్నంలో ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. సీఎం రేవంత్ అసత్యాలతో బీసీలకు 42 రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే, లేకపోతే భాస్కర్ అవార్డు అయినా ఇవ్వొచ్చు అన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. సీఎం రేవంత్ లాగా బ్యాగులు మోసి రాజకీయాల్లో పైకి రాలేదని, ప్రజాసేవతోనే మేము రాజకీయాల్లోకి వచ్చాం అని అన్నారు.
ఇక బీఆర్‌ఎస్ నేత క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అబద్ధాల ద్వారా అధికారంలోకి వచ్చారు. అటువంటి వారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు బీసీలను, సామాజిక గౌరవాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, చేపలు పట్టేవారిని మంత్రి చేశాను, బట్టలు ఉతికేవారిని ఎమ్మెల్యే చేశానన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ వ్యక్తిత్వంపై కాంగ్రెస్ నాయకులు దూషణలు చేస్తున్నారని మల్లేశ్ మండిపడ్డారు. కేటీఆర్ హీరోయిన్లకు ఫోన్ చేస్తుంటే, మీరు డోర్ దగ్గర కావలిచేస్తున్నారా..? అంటూ కౌంటర్ వేశారు. అలాగే పార్టీ మారిన నేతలపై కూడా మల్లేశ్ తీవ్రంగా స్పందిస్తూ.. అలాంటి పిచ్చికుక్కలను తొండలెక్కించి కొట్టాలి.. రేవంత్ కూడా భవిష్యత్తులో వారిపై వాత పెడతాడన్నారు.