డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వరకు వసూలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి 83 మంది వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పర్సనల్ అసిస్టెంట్ హరిబాబును జీడిమెట్ల పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తానని చెప్పి పేదల నుంచి లక్షల రూపాయలను హరిబాబు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తనకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడని.. తీరా చూస్తే ఇల్లు రాలేదని రమేష్ అనే బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బోడిమి శెట్టి హరిబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ స్కాంలో 83 మంది బాధితులు ఉన్నట్లు , వారి నుంచి రూ.84 లక్షల వరకు వసూలు చేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో తెలిపారు బాధితులు. హరిబాబు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, స్కాంలో మరో వ్యక్తి గడ్డం శ్రీధర్ ముదిరాజ్ పై కేసు నమోదు చేసినట్లు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు.