2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాల్లో విస్తృత స్థాయిలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో ఆయన సమర్పించిన ప్రజెంటేషన్‌లో, కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర రాష్ట్రాల జాబితాల్లోనూ అదే పేరు పునరావృతం కావడం, ఉనికిలో లేని చిరునామాలు, ఒకే ఇంటి నంబర్‌కు వందల ఓట్లు కేటాయించడం, తప్పు ఫొటోలు కలిగిన గుర్తింపు కార్డులు, కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫారం-6 దుర్వినియోగం వంటి ఉదాహరణలను ప్రస్తావించారు. ఈ అవకతవకలన్నీ అధికార బీజేపీకి లాభం చేకూర్చే విధంగా జరిగాయని, అంతేకాకుండా ఎన్నికల షెడ్యూల్‌ను కూడా పాలకపార్టీకి అనుకూలంగా రూపొందించిందని, డిజిటల్ ఓటర్ల జాబితాను కాంగ్రెస్‌కి అందించలేదని రాహుల్ ఆరోపించారు.
రాహుల్ వ్యాఖ్యలపై భారత ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ఆయన చేసిన ఆరోపణలు “అర్థం పర్థం లేని”వని పేర్కొంటూ, నిజంగా అవి సత్యమని నమ్మితే ప్రమాణపూర్వక అఫిడవిట్ సమర్పించాలని, లేకపోతే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. “ఆయనకు ఈ రెండు మార్గాలే అందుబాటులో ఉన్నాయి” అని ఈసీ వర్గాలు తెలిపాయి. ఇక, బీజేపీ మీడియా విభాగం అధిపతి అమిత్ మాలవీయ కూడా రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన వద్ద నిజమైన ఆధారాలు ఉంటే అనర్హుల ఓటర్ల పూర్తి జాబితాను వెంటనే సమర్పించాలని డిమాండ్ చేస్తూ, అలా చేయకపోతే ఇది కేవలం రాజకీయ నాటకం మాత్రమేనని, ఎన్నికల సంఘం ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాంగ్రెస్ ఉద్దేశమని ఆరోపించారు.