అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో చాయ్‌బాసా కోర్టులో బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఝార్ఖండ్‌లోని చాయ్‌బాసా ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఆయనకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. 2018లో చాయ్‌బాసాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన వ్యాఖ్యలు అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా పరువు నష్టంకు కారణమయ్యాయని ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో విచారణ చేపట్టిన కోర్టు, రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. కాగా, జూన్ 26న కోర్టుకు హాజరుకావాల్సిన రాహుల్, ఇతర కారణంగా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించి తేదీ మార్పు కోరగా, ఆగస్టు 6న హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీ బుధవారం కోర్టులో హాజరై బెయిల్ పొందారు. తదుపరి విచారణకు కోర్టు తేదీ ప్రకటించనుంది.