రాజస్థాన్‌లోని ఝూలవర్ లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఝూలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఈ ప్రమాదంలో సుమారుగా మరో 40 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సంబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంపై గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోక పోవడంతో వర్షం కారణంగా బిల్డింగ్ గోడ కూలిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.