వెంకటపతి రాజు ప్రశంసల జల్లు
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై మాజీ క్రికెటర్, తెలుగు తేజం వెంకటపతి రాజు ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లండ్ గడ్డపై సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడని కొనియాడారు. సిరాజ్‌ను మెక్‌గ్రాత్‌తో పోలుస్తూ సునీల్ గవాస్కర్ ప్రశంసించాడని గుర్తు చేశారు. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన పోరులో పడిలేచిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు సాధించింది.
ఈ విజయంపై మైఖేల్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన వెంకటపతి రాజు.. సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘మహ్మద్ సిరాజ్ అద్భుతంగా ఆడాడు. ఈ సిరీస్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లూ ఆడిన ఏకైక పేసర్ అతనే. ఇది చాలా గొప్ప విషయం. సునీల్ గవాస్కర్ కూడా అతన్ని కొనియాడారు. సిరాజ్‌ను గ్లెన్ మెక్‌గ్రాత్‌తో పోల్చారు. ఇది సిరాజ్ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. కీలక సమయాల్లో అతను పట్టుదలతో బౌలింగ్ చేశాడు. ఇది అంత సులువు కాదు. ఎంత పెద్ద సవాల్ ఎదురైతే.. సిరాజ్ అంత బాగా రాణిస్తాడు.హ్యారీ బ్రూక్ క్యాచ్ చేజార్చిన తర్వాత.. సిరాజ్ పుంజుకున్న తీరు అద్భుతం. అతను చేసిన పోరాటం ప్రశంసనీయం. నిలకడగా బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. మిగతా బౌలర్లంతా మధ్య మధ్యలో బౌలింగ్ చేశారు, కానీ సిరాజ్ ఆఖరి వరకు నిలకడగా బౌలింగ్ చేశాడు.
ఇంగ్లండ్ కండిషన్స్‌లో ఆడటం బిగ్ ఛాలెంజ్. భారత్ ఇంత బాగా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. యశస్వి జైస్వాల్ కూడా బాగా ఆడాడు. కానీ ఇంకా కొంచెం పరిణితి చెందాలి. భవిష్యత్తులో అతను చాలా పరుగులు చేస్తాడని భావిస్తున్నా. ఈ సిరీస్‌లో వెనుకంజలో నిలిచినా.. టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. ఈ గెలుపుతో టీమిండియాపై అంచనాలు పెరిగాయని వెంకటపతి రాజు చెప్పుకొచ్చారు.