ఆస్ట్రేలియా పర్యటనలో ఎట్టకేలకు సౌతాఫ్రికా తొలి విజయాన్నందుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన సఫారీ టీమ్.. ఆ పరాజయం నుంచి త్వరగానే తేరుకుంది. మంగళవారం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 53 పరుగుల తేడాతో గెలుపొందింది. జూనియర్ ఏబీడీ, డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసకర శతకంతో సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20 శనివారం జరగనుంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 125 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్(22 బంతుల్లో 3 ఫోర్లతో 31) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలరర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్(2/44), బెన్ ద్వార్షుయిస్(2/24) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ఆడమ్ జంపా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఆస్ట్రేలియా 17.4 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. మరోసారి టీమ్ డెవిడ్(24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22), అలెక్స్ క్యారీ(18 బంతుల్లో 3 ఫోర్లతో 26) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫకా(3/57), కోర్బిన్ బోచ్(3/20) మూడేసి వికెట్లు తీయగా.. మార్క్‌రమ్, పీటర్ రబడా తలో వికెట్ తీసారు.