నోట్ల కట్టల కేసులో జస్టిస్ వర్మపై సుప్రీం ఆగ్రహం
నోట్ల కట్టల వ్యవహారం కేసు జస్టిస్ యశ్వంత్ వర్మను వెంటాడుతోంది. ఇక త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. నోట్ల కట్టలు వర్మవిగా కమిటీ తేల్చింది. అయితే కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వర్మ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. న్యాయమూర్తిని తొలగించాలని అంతర్గత విచారణ ప్యానెల్ చేసిన సిఫార్సు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మీ ప్రవర్తన నమ్మశక్యంగా లేదని.. రాజ్యంగ విరుద్ధమని భావిస్తే విచారణకు ఎందుకు హాజరయ్యారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ముందే సవాల్ చేయాల్సింది కదా? అని అసహనం వ్యక్తం చేసింది. న్యాయపరమైన తప్పులు జరిగినప్పుడు చర్య తీసుకునే హక్కు చీఫ్ జస్టిస్‌కు ఉంటుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
మార్చి 14న జస్టిస్ యశ్వంత వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 11:43 గంటలకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగదు వీడియోలను రికార్డ్ చేసి ఢిల్లీ పోలీసులు.. సీనియర్ అధికారులకు పంచారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందించారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దాదాపు రూ.15 కోట్ల వరకు నగదు ఉంటుందని సమాచారం. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. కానీ ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది.