విచారణ నిలిపివేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీం
భూములకు ఉద్యోగాల కుంభకోణం లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఈ కేసు విచారణ యథాతథంగా కొనసాగనుంది. ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ జోన్ జబల్‌పూర్‌లో గ్రూప్-డి నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసు ఇది. 2004 – 2009 మధ్య లాలూ ప్రసాద్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నారు. ఉద్యోగాలకు ప్రతిగా అభ్యర్థులు లాలూ కుటుంబసభ్యులు, సన్నిహితులకు భూములు బదలాయించారని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ఆరోపణగా ఉంది.
ఈ క్రమంలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాల్సిందిగా లాలూ ప్రసాద్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే అత్యున్నత న్యాయస్థానం ఇందుకు నిరాకరించింది. విచారణను త్వరతగతిన పూర్తి చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును న్యాయమూర్తులు ఎంఎం సుంద్రేష్, ఎన్.కోటీశ్వర్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ముందు జరుగుతున్న విచారణలో జోక్యం చేసుకోలేమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విచారణ కోర్టుకు లాలూ ప్రసాద్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. దీనికి ముందు, ఈ కేసులో ప్రత్యేక కోర్టు ముందున్న విచారణపై స్టే ఇచ్చేందుకు మే 29న ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది.