పార్టీ బలోపేతంపై చర్చలు..
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఎన్. రాంచందర్ రావు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు, గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తూ తెలంగాణ అంతటా బీజేపీని బలపరిచేందుకు తాను పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నట్లు అమిత్ షాకు వివరించారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర నాయకత్వం సూచిస్తున్న మార్గదర్శకాలను పాటిస్తూ, ముఖ్యంగా యువతను, మహిళలను పెద్ద ఎత్తున పార్టీకి ఆకర్షించేందుకు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఇక, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని మరో స్థాయికి తీసుకెళ్లేలా విస్తృత పర్యటనలు, బూత్ స్థాయి సమావేశాలు, సుస్థిర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు.. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ నిరంతరం ఎత్తిచూపుతూ, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా రాంచందర్ రావుకు శుభాకాంక్షలు తెలియజేసి, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంలో పార్టీ అన్ని విధాలుగా ఆయనకు సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీకి సంబంధించిన తదుపరి కార్యాచరణ, రాష్ట్రంలో పార్టీ విస్తరణ, ఎన్నికల వ్యూహం తదితర అంశాలపై చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.