- టిబెట్ బౌద్దగురువు ఎంపికలో చైనా జోక్యం సహించం
- తన వారసత్వం కొనసాగాలా లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దలైలామా
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా తాజాగా చైనాకు షాక్ ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక పక్రియ కొనసాగుతుందని.. దానిని నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన వారసత్వం కొనసాగాలా, వద్దా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని తాను 1969లోనే వెల్లడించినట్లు దలైలామా పేర్కొన్నారు. తాజా అభిప్రాయాల ఆధారంగా గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్ మాత్రమే దలైలామా పునర్జన్మను నిర్ణయిస్తుందని.. ఈ పక్రియలో మరెవరికీ జోక్యం చేసుకొనే అధికారం లేదని తేల్చిచెప్పారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి.. తన వారసుడి ఎంపిక కొనసాగించాలా..? అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్నివర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. స్పందించిన వారిలో టిబెట్ మతపెద్దలు, చైనాలోని వారు కూడా ఉన్నట్లు వెల్లడించారు. తన వారసత్వం భవిష్యత్తులో కొనసాగాలని వారంతా కోరుకున్నట్లు తెలిపారు.
చాలా ఏళ్ల క్రితం దలైలామా ఒక దశలో తనతోనే ఈ సంప్రదాయం ముగిసిపోతుందని ఆందోళన చెందారు. కానీ, ఆ తర్వాత తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని చెప్పారు. టిబెట్‌ను గుప్పిట పెట్టుకోవడానికి తమ చెప్పుచేతల్లో ఉండే కీలుబొమ్మను దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ఎప్పటినుంచో ఉబలాటపడుతోంది. ఆ ప్రాంతాన్ని 1950లో ఆక్రమించిన చైనా- ఆ తరవాత దాన్ని తన భూభాగంలోకి మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా చైనీస్ మూలాలున్న హన్ జాతి ప్రజలు ఇబ్బడిముబ్బడిగా టిబెట్‌లో స్థిరపడేలా చేసింది. ఆక్రమణ తరవాత లక్షల సంఖ్యలో అక్కడి చిన్నారులను దూర ప్రాంతాలకు తరలించి వారికి బ్రెయిన్ వాష్ చేసింది. అక్కడి పీఠభూమిలో విస్తారంగా బొగ్గు, రాగి, క్రోమియం, లిథియం, జింక్, సీసం, బోరాన్ నిక్షేపాలు ఉండడంతో వాటిపైనా చైనా కన్నేసింది. టిబెట్‌పై పట్టు కోసం భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావించింది. ఆ స్థానం ఎంపికలో పంచయిన్ లామా పాత్ర చాలా కీలకం. టిబెట్‌లోనే ఉండిపోయిన పంచయిన్ లామా 1989లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనపై విష ప్రయోగం చేశారంటారు. పంచయిన్ లామా వారసుడిగా ఎంపికైన బాలుడిని తన అధీనంలో ఉంచుకొన్నట్లు కొన్నేళ్ల కిందట బీజింగ్ ప్రకటించింది. ఈ ఎత్తుగడలను గ్రహించిన దలైలామా తన పునర్జన్మ టిబెట్ బయట కూడా జరగొచ్చని ప్రకటించారు. దీంతోపాటు వారసుడిని ఎంపిక చేసే పక్రియ కూడా తమదేనని తేల్చిచెప్పారు.