మనసుతో, మాటతో, మనసులో మాటతో ఓ నిజాన్ని ఆరాధించి , అక్షరంలో ప్రతిష్టించి ఓ ఆలోచన రగిలించి సాహిత్యాన్ని శాస్త్రీయంగా, శాస్త్రీయతను సాహిత్యంలో చిత్ర, విచిత్రంగా విస్మయం కలిగేలా కవిత్వం చెప్పగలిగిన ప్రతిభ కలిగి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఓ కొత్త కోణంలో నడిపించాలన్న ఆత్మవిశ్వాసం గల యువకవి ఫిజిక్స్ అరుణ్ కుమార్.
వృత్తి రీత్యా ఫిజిక్స్ బోధిస్తున్నా మనసు రీత్యా పుట్టే ఆలోచనలన్నీ సృష్టిలో గొప్పదైన సత్యాల వైపు పయనించే మార్గంలో ఎదురైనా ఎందరో మహానుభావులైన గాంధీ, వివేకానంద, అంబేద్కర్, సి.వి.రామన్, ఐన్ స్టీన్, భగత్ సింగ్, చేగువేరా, కాళోజీ, శ్రీ శ్రీ, ఇలా ఎందరినో పలు రంగాల్లో గొప్పవారి ఆలోచనలను ఆలోచించడంలో కలిగిన తన సొంత భావాలను కవితలరూపంలో వ్రాయడం అలవాటుగా మార్చుకున్నాడు. తన కంటి ముందు కనిపించిన ప్రతి సమస్య లోతుకెళ్లి దాని వెనుకున్న చరిత్రను వెదకడంలో విజయం సాధించాడు. దాని ఫలితమే ఈయన వ్రాసిన “శూన్యం” కవితా సంపుటి.

ఈ పుస్తకాన్ని భారత దేశంలో నోబెల్ బహుమతి పొందిన సాహిత్య రంగానికి చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్, భౌతిక శాస్త్రానికి చెందిన సి.వి. రామన్ లకు అంకితం ఇవ్వడంలోనే అర్థం చేసుకోవచ్చు ఆ ఇద్దరి ప్రభావం మనసుపై ఎంతగా ఉందో! భిన్న రంగాలుగా కనిపించే వీరి సిద్ధాంతాలను, ఆలోచనలన్నీ రెండిటినీ కలబోసిన ఓ కొత్త ఆలోచనతో ముందుకు నడచిన అరుణ్ కుమార్ పయనం ప్రశంసనీయం.అలాగే ప్రపంచాన్ని అర్థం చేసుకోవలసిన పలు ముఖ్యమైన రంగాల ప్రముఖుల జీవిత చరిత్రలను చదివిన మూలంగా కుల, మత, వర్గ ,ప్రాంత రహితంగా మానవ జీవితంలో ముఖ్యమైన అంశాలపై పట్టు సాధించాలన్న లక్ష్యం ఈయన కవితల్లో కనిపిస్తుంది. మనిషి జీవితంలో మనసు ప్రాధాన్యతను తెలిపే ప్రతి సున్నితమైన విషయంలోనూ జ్ఞానం,విజ్ఞానం పట్ల అవగాహన రావడం ఈ కవితల్లో గమనించవచ్చును.
తను తొలిగా వ్రాసిన 58 కవితల్లో చాలా వరకు ఓ తాత్వికత మరియు హేతుబద్ధతతో కూడిన కవితలని చూడవచ్చు.కొన్ని విలువల్ని యెత్తి చూపుతూ రాబోయే తరాలకు బోధించే దిశగా సాగాయి. మనిషి జీవితంలో బాల్యం గొప్ప విలువైన జ్ఞాపకం మరియు తరగని ఆస్తి లాంటిది.”అసూయ, కోపం, స్వార్థం లేని పసిప్రయం ఎంత బాగుందో…./ మళ్ళీ మళ్ళీ రాని బాల్యం ఎంత బాగుందో…నా మనసేమో మళ్ళీ ఓ సారి రమ్మంటోంది”….అన్న వాక్యాల్లో అనుభవం సుమారుగా ప్రతివారిని తాకుతాయి.
ఏదైనా కొత్త విషయాన్ని మనం గురువు నుండి తెలుసుకుంటాం.అలాగే గురుబలం కలిగిన ఏన్నో విషయాల నుండి ఎంతో నేర్చుకుంటాం..అదే విషయాన్ని “అయస్కాంత దిక్సూచి” కవితలో చూస్తాము. ఆధునిక సమాజపు ఆత్మగా అజ్ఞానపు అంధకారాన్ని తరిమే అర్హత గల ఆశయాల వారధి లో నిజాయితీకి నిర్వచనం గురువు…తనకు తాను ప్రకాశించే ఫిజిక్స్ గురువు..మానవీయత మరో కోణం గురువు..
అదే విధంగా జీవితం గురించే ఓ కవితలో పారిపోవడం, చనిపోవడం కాదు..మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయి…ఈ ప్రపంచాన్ని పట్టించుకోవద్దు.భవిష్యత్ తరాలకు నీవే భానుడవు…అని చెప్పడంలో ఓ అభయం కనిపిస్తుంది.
అందరి కవులు లాగే ఆధునిక కవిత్వాన్ని ఆలోచించేటప్పుడు శ్రీ శ్రీ గుర్తుకు రాకపోడుఎవరి స్థాయికి తగినట్లుగా వారు వ్రాయకుండ
ఉండలేరు. “శ్రీ శ్రీ రెండక్షరాల శిఖరం….సూర్య చంద్రుల సంగమం…అలంకార, ఆధిపత్య మధ్య బందీగా ఉన్న తెలుగు వెలుగుని సామాన్యుల జీవనంలో జీవంగా మారిన అక్షర రాకెట్”…
దేశ భక్తి పునాదిగా సాగిన “మన.రాజ్యాంగపుగుండె శబ్ధం….” అనే కవితలో గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు నా దేశ వారసత్వం/రామేశ్వరం వీధుల సాక్షిగా కలాం మీకు సలాం….ఈ వాక్యాల్లో దేశం కనిపిస్తుంది.మన తెలుగు వెలుగు అనే కవితలో భాష గొప్పదనాన్ని చెప్పు సందర్భంలో “పోటీ ఏదైనా తెలుగు భావాన్ని గెలిపిద్దాం” అనే వాక్యం వెనుక భాష బతికితేనే భావం బతుకుతుంది అనే అర్థం దాగుంది.
దేశానికి వెన్నుముక రైతు పక్షాన ఓ పౌరుడిగా బాధ్యత వహించే పర్వంలో నేను సైతం అనే పదాన్ని కవితా శీర్షికతో రైతుదేవోభవ అనే కొత్త నినాదాన్ని అందించి రైతు జీవితాలని, కష్టాలని ఆలోచించే విధంగా ఈ కవిత సాగింది.ఫిజిక్స్ పరిభాషలో కొన్ని పదాలను వాడి కవిత్వాన్ని కొత్త అందంలో మనసులో ముద్ర పడేలా చేయడంలో బాగుంది. నిశ్శబ్దంగా మండటం నేర్చుకో , నా గుండె లోలకమై, విప్లవ క్షిపణుల వికిరణాలు లాంటి శీర్షికలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
శూన్యమే సత్యం , అనంతం దాని నైజం…అంటూ తన సాపేక్ష సిద్ధాంతంలో ఫిజిక్స్ లో ఫిలాసఫీ, ఫిలాసఫీ లో పోయెట్రీ అంటూ ఓ కొత్త ఆలోచన అందరిలో పుట్టించడం ఈ కవితా సంపుటి ప్రత్యేకత.
ఈ పుస్తకానికి పేరుకి అర్హత సాధించిన కవిత శూన్యం. ఈ కవితలో ” బతకడం కోసం రాసినవి కొన్ని.. బతుకంటే ఏమిటో చెపుతూ రాసినవి కొన్ని…చచ్చాక బ్రతికుండేలా రాసినవి కొన్ని…ఎప్పటికీ చావులేని రాతలు కొన్ని…” అంటూనే జీవితంలో మిస్టరీ, లిటరేచర్, జ్ఞానం, అజ్ఞానం, ప్రశ్న,జవాబు, ఆలోచన, అన్వేషణ, స్వప్నం, మరియు సత్యం నేపథ్యం గా సంపూర్ణ కవిత్వాన్ని , ఆ పరిమళాన్ని పాఠకులకు పంచాలని తపన కనిపిస్తుంది.
అలాగే మనిషి నుండి భూమికి సమస్యలు, మనిషి నాశనం చేస్తున్న ప్రకృతిని, రాబోయే కాలంలో భూమిని, మనిషిని అక్షరాలతో అంచనా వేసి నేటి మనిషిని హెచ్చరిస్తూ గ్లోబల్ వార్మింగ్, బ్లాక్ హోల్ కవితలో తన భావాలను వెల్లడించారు.ఈ విధముగా పోతుల అరుణ్ కుమార్ ఫిజిక్స్ అరుణ్ కుమార్ గా మార్పు వెనుక గల బలమైన ఆసక్తిని ఇంకో వైపు తనకున్న సాహిత్యభిరుచిని చాటుకోవడంలో ఓ శాస్త్రీయతను పాటిస్తూ అక్షరంలో కలసి వేసిన ప్రతి అడుగులో ఓ సమస్యను యెత్తి చూపుతూ , ఓ ప్రశ్న ను పాఠకుల మదిలో నాటి సాగించిన ఈ సాహితీ సేవ ఓ విలక్షతకి అద్దం పట్టింది. అందుకే రేపటి సమస్యలను నేడు ముందే కవిత్వంలో చూపిన అరుణ్ కుమార్ కవిత్వాన్ని అందరం చదివి ప్రోత్సహించాల్సిన ఓ మంచి భావుకుడు ఫిజిక్స్ అరుణ్ కుమార్.

– చందలూరి నారాయణరావు, 9704437247